Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఉక్రెయిన్‌పై ‘హేజల్‌నట్’ ఒరెష్నిక్‌తో రష్యా దాడి
ఉక్రెయిన్‌పై ‘హేజల్‌నట్’ ఒరెష్నిక్‌తో రష్యా దాడి

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిపినట్లు క్రెమ్లిన్ ఆరోపించిన నేపథ్యంలో.. దీనికి ప్రతీకారంగా రష్యా అత్యాధునిక ‘ఒరెష్నిక్’ బాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. గురువారం అర్ధరాత్రి పశ్చిమ ఉక్రెయిన్‌లోని లివివ్ ప్రాంతంపై ఈ హైపర్‌సోనిక్ క్షిపణి దాడి జరిగింది. ధ్వని వేగంకంటే 10 రెట్లు వేగవంతమైన ఈ క్షిపణితో కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ దాడిలో భూగర్భ సహజ వాయు నిల్వలు లేదా ఇతర కీలక స్థావరాలు ఛిద్రమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఖచ్చితమైన లక్ష్యం గురించి మాస్కో నోరు విప్పలేదు. ఉక్రెయిన్ అధికారులు మాత్రం ఈ దాడుల్లో నలుగురు మరణించగా, 22 మంది గాయపడ్డట్లు వెల్లడించారు. ఒరెష్నిక్‌తో పాటు మొత్తం 36 క్షిపణులు, 242 డ్రోన్లతో రష్యా భారీ దాడులు చేసిందని కీవ్ ఆరోపించింది. నాటో సరిహద్దుకు చాలా సమీపంలో ఈ ఒరెష్నిక్ క్షిపణి పడటంతో ఐరోపా భద్రతకు పెను ముప్పని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అభివర్ణించారు.
యూరప్ మొత్తం రష్యా పరిధిలో..
ఒరెష్నిక్ అంటే రష్యన్ భాషలో ‘హేజల్‌నట్’ (ఒక రకం చెట్టు) అని అర్థం. రష్యా సాంప్రదాయంగా తమ క్షిపణులకు చెట్ల పేర్లు పెడుతుంది. ఇది మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది. యూరప్‌లోని దాదాపు అన్ని దేశాలు దీని పరిధిలోకి వస్తాయని రష్యా మిస్సైల్ దళాల అధిపతి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ క్షిపణిని అడ్డుకునే సామర్థ్యం ప్రపంచంలో ఏ ఆయుధ వ్యవస్థకూ లేదని రష్యా ధీమా వ్యక్తం చేస్తోంది.
2024 నవంబరులో తొలిసారిగా ఉక్రెయిన్‌లోని ఒక ఫ్యాక్టరీపై ఈ క్షిపణిని పరీక్షార్థం ప్రయోగించారు. ఇటీవలే దీన్ని పూర్తి స్థాయి ఆపరేషనల్‌గా సిద్ధం చేశారు. అణు బాంబులు లేదా మల్టిపుల్ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల ఈ క్షిపణిని రష్యా మిత్రదేశం బెలారస్‌కు కూడా తరలించినట్లు సమాచారం.
ఈ దాడులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో కొత్త దశలోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. ఐరోపా దేశాలు ఈ పరిణామాలను ఆందోళనతో గమనిస్తున్నాయి.

