Saudi Prince: లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడు మృతి: మద్యం-డ్రగ్స్ మిశ్రమం కారణం
మద్యం-డ్రగ్స్ మిశ్రమం కారణం

Saudi Prince: లండన్‌లోని ప్రముఖ లగ్జరీ హోటల్‌లో సౌదీ అరేబియా రాకుమారుడు అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావి అల్ సౌద్ మృతిచెందిన ఘటన సంచలనం సృష్టించింది. గతేడాది నవంబరు 25న ఈ ఘటన జరిగినా, ఇటీవలే దర్యాప్తు వివరాలు వెలుగులోకి వచ్చాయి.
29 ఏళ్ల రాజకుమారుడు లండన్‌లోని మారియట్ హోటల్‌లో బస చేస్తుండగా హోటల్ గదిలో స్పృహ కోల్పోయినట్లు కనుగొన్నారు. సిబ్బంది వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవపరిచారు.
బ్రిటిష్ అధికారులు నిర్వహించిన దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రాకుమారుడు పెద్ద మొత్తంలో మద్యం, డ్రగ్స్ (GHB, క్యానబిస్) మరియు ఔషధాలు (Xanax) ఒకేసారి తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చి మృతిచెందినట్లు తేలింది. మద్యం మానేయడానికి వాడిన ఔషధాలు కూడా ఈ మిశ్రమంలో ఉన్నాయి. ఆయనకు మాదకద్రవ్యాలపై ఆధారపడే సమస్య ఉందని, ఇటీవలే రీహాబ్ సెంటర్‌లో చికిత్స పొందినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
సుసైడ్ లేదా ఏ విధమైన దురుద్దేశాలు లేవని CCTV ఫుటేజ్, మెడికల్ రిపోర్టులు స్పష్టం చేశాయి. అసిస్టెంట్ కరోనర్ జీన్ హార్కిన్ ఈ మరణాన్ని 'మిస్‌అడ్వెంచర్' (ప్రమాదకరమైన ఓవర్‌డోస్)గా ప్రకటించారు.
సౌదీ రాయల్ కోర్టు ఈ మరణాన్ని అధికారికంగా ధృవీకరించింది. రియాద్‌లోని వీఐపీ ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

