Trump: అంకారా, టర్కీలో జరిగిన నాటో సదస్సు తర్వాత గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ నుంచి వచ్చిన తీవ్రమైన హత్య బెదిరింపుల నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులు అసాధారణ రహస్య చర్యలు చేపట్టారు. ట్రంప్‌ను ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి క్యాటరింగ్ కంటైనర్‌లో దాచి రహస్యంగా తీసుకెళ్లారు. కానీ అదే ప్రమాదకరమైన విమానాన్ని సీనియర్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది, పాత్రికేయులతో నింపి ఆకాశంలోకి పంపారు. వారు తమను డికాయ్‌గా ఉపయోగిస్తున్నారని చాలామందికి తెలియదు.

జూలై 8న అంకారా ఎసెన్‌బోగా విమానాశ్రయంలో ట్రంప్ సాంప్రదాయ బ్లూ అండ్ వైట్ బోయింగ్ 747 (పాత ఎయిర్‌ఫోర్స్ వన్) స్టెయిర్‌వే ఎక్కి కెమెరాల ముందు చేతులు ఊపి క్యాబిన్‌లోకి వెళ్లారు. కొన్ని నిమిషాల్లోనే విమానం మరో వైపు గ్యాలీ సర్వీస్ డోర్ వద్ద హైడ్రాలిక్‌గా ఎత్తిన క్యాటరింగ్ ట్రక్ కంటైనర్‌లోకి ట్రంప్, కొందరు సహాయకులు దూరారు. ఆ ట్రక్ వారిని దగ్గరలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ సి-32ఎ (బోయింగ్ 757 సైనిక వెర్షన్) వద్దకు తీసుకెళ్లింది. ఆ విమానం “రీచ్ 18” కాల్ సైన్‌తో, ట్రాన్స్‌పాండర్లు ఆఫ్ చేసి రహస్యంగా బయలుదేరింది.

ఇంతలో పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వైట్‌హౌస్ సిబ్బంది, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, సీనియర్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్, స్టీవెన్ చెంగ్‌తో పాటు పాత్రికేయులు ఎక్కారు. వారు ట్రంప్ విమానంలోనే ఉన్నారని నమ్మారు. టేకాఫ్ ముందు విండో షేడ్స్ మూసేయమని సూచించారు. ఆ విమానం మధ్యలో “ఏఎఫ్1” కాల్ సైన్‌కు మారి డికాయ్‌గా ఎగిరింది. రెండు విమానాలు బ్రిటన్‌లోని ఆర్‌ఎఎఫ్ మిల్డెన్‌హాల్‌కు చేరుకున్నాయి. అక్కడ ట్రంప్‌ను తిరిగి పాత ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి మార్చి కెమెరాల ముందు దిగేటట్లు చేశారు.

ఈ చర్య ఇరాన్ ఎయిర్‌ఫోర్స్ వన్‌పై క్షిపణి దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు అంచనా వేసినందున జరిగింది. ట్రంప్ తర్వాత “నేను ఇరాన్ లిస్ట్‌లో నెంబర్ వన్” అని చెప్పారు. మంగళవారం ఆయన “సీక్రెట్ సర్వీస్, సైన్యం కోరుకున్నారు. వేరే విమానం ఎక్కమన్నారు. నేను వారు చెప్పినట్టు చేశాను. నా విమానమే ఎక్కువ ప్రమాదంలో ఉందని అనుకుంటున్నాను” అని సమర్థించుకున్నారు.

మాజీ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జో లాక్‌హార్ట్ ఇలా విమర్శించారు: “అధ్యక్షుడు, ఆయనతో ఉన్న కొద్దిమంది గురించే ఆలోచించారు. సాధారణ పౌరులను హ్యూమన్ షీల్డ్‌గా వాడకూడదని మేము ఎంతో జాగ్రత్త పడేవాళ్లం. ఇక్కడ అలా జరగలేదు.” మరోవైపు మాజీ బుష్ సలహాదారు జోసెఫ్ హాగిన్ “వైట్‌హౌస్‌లో పనిచేసేవారు, అధ్యక్షుడితో ప్రయాణించేవారు ప్రమాదాన్ని అంగీకరిస్తారు. ఆపరేషన్ వివరాలు చెప్పితే అధ్యక్షుడి భద్రతే దెబ్బతింటుంది” అని అన్నారు.

గతంలో జార్జ్ బుష్, బరాక్ ఒబామా ఇరాక్ వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు, బిల్ క్లింటన్ పాకిస్తాన్‌కు వెళ్లేటప్పుడు ఇలాంటి రహస్య చర్యలు జరిగాయి. కానీ ట్రంప్ బృందం చేసిన ఈ టర్కీ ఆపరేషన్, ప్రమాదాన్ని ఇతరులపైకి మళ్లించడం, ఎంతకాలం రహస్యంగా ఉంచడం వల్ల ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత పాత్రికేయులు, సిబ్బందిని “ఎక్స్‌పెండబుల్”గా చూశారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story