H-1B Visa Applicants: వర్క్ పర్మిట్ రెన్యూవల్‌కు వచ్చినవారికి షాక్!..ఇండియాలో చిక్కుకున్న హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు..
ఇండియాలో చిక్కుకున్న హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు..

H-1B Visa Applicants: అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు చెందిన హెచ్-1బీ వీసా హోల్డర్లు పెను సమస్యల్లో చిక్కుకున్నారు. వీసా స్టాంపింగ్ కోసం లేదా వర్క్ పర్మిట్ పునరుద్ధరణ కోసం డిసెంబర్‌లో భారత్‌కు వచ్చిన వారు ఇప్పుడు అమెరికాకు తిరిగి వెళ్లలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అమెరికా దౌత్య కార్యాలయాలు డిసెంబర్ 15 నుంచి అపాయింట్‌మెంట్లను భారీగా రద్దు చేసి, కొత్త తేదీలను 2026 మార్చి, ఏప్రిల్, జూలై వరకు వాయిదా వేశాయి.
ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సోషల్ మీడియా స్క్రీనింగ్ పాలసీ వల్లే ఈ జాప్యాలు ఏర్పడ్డాయని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు దరఖాస్తుదారులకు ఈమెయిల్స్ ద్వారా తెలిపారు. ఇప్పటివరకు విద్యార్థులు (ఎఫ్, ఎం, జే వీసాలు)కే అమలవుతున్న ఈ ఆన్‌లైన్ ప్రెజెన్స్ రివ్యూ ఇకపై హెచ్-1బీ, హెచ్-4 దరఖాస్తుదారులకు కూడా తప్పనిసరి అయింది. ప్రతి అప్లికేషన్‌ను వివరంగా పరిశీలించాల్సి రావడంతో రోజువారీ ఇంటర్వ్యూల సంఖ్య తగ్గింది. దీంతో భారత్‌లోని అమెరికా కాన్సులేట్లు ఆపరేషనల్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
చాలామంది హెచ్-1బీ ఉద్యోగులు డిసెంబర్ హాలిడే సీజన్‌లో ఇండియాకు వచ్చి వీసా రెన్యూవల్ చేసుకుని తిరిగి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ హఠాత్తుగా అపాయింట్‌మెంట్లు రద్దు కావడంతో వారు ఇక్కడే చిక్కుకుపోయారు. అమెరికాలో రిమోట్ వర్క్‌కు అనుమతి లేకపోవడం, ఉద్యోగాలు ప్రమాదంలో పడటం వంటి సమస్యలు తలెత్తాయి. కొందరు ఎమర్జెన్సీగా అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నారు. గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి – అనవసర ట్రావెల్ చేయొద్దని, దీనివల్ల తిరిగి రావడం కష్టమవుతుందని.
అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేసేందుకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (వర్క్ పర్మిట్) అవసరం. దీన్ని పునరుద్ధరించుకోవడానికే చాలామంది భారత్‌కు వస్తుంటారు. ఈ కొత్త నిబంధనలతో వేలాది మంది భారతీయులు ఇబ్బందులు పడుతున్నారు. దౌత్య కార్యాలయాలు కొత్త అపాయింట్‌మెంట్లు ఇస్తున్నాయి కానీ, అవి చాలా ఆలస్యంగా ఉండటంతో సమస్య పరిష్కారం కావడం లేదు.
ఈ పరిణామాలపై అమెరికా దౌత్య ప్రతినిధులు స్పందిస్తూ – గతంలో వేగంగా ప్రాసెసింగ్ చేసేవాళ్లమని, ఇప్పుడు ప్రతి కేసును జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ జాప్యాలు ఎప్పటివరకు ఉంటాయనేది స్పష్టత లేదు. దరఖాస్తుదారులు ఓపిక పట్టాల్సిందే!

