Shock to Ally Canada: మిత్రదేశం కెనడాకు షాక్! అమెరికా ఉమ్మడి రక్షణ మండలి నుంచి తాత్కాలికంగా వైదొలగింపు
తాత్కాలికంగా వైదొలగింపు

రక్షణ వాగ్దానాల్లో విఫలమైన కెనడాపై ట్రంప్ యంత్రాంగం తీవ్ర విమర్శలు.. WWII నుంచి కొనసాగుతున్న ఓగ్డెన్స్‌బర్గ్ ఒప్పందానికి బీటలు
Shock to Ally Canada: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సన్నిహిత మిత్రదేశం కెనడాకు బిగ్ షాక్ ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచి (1940) కొనసాగుతున్న ఉమ్మడి రక్షణ సహకారం నుంచి అమెరికా తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కెనడా తన రక్షణ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని, మాటలు-చర్యల మధ్య అంతరం ఎక్కువగా ఉందని ట్రంప్ పరిపాలన తీవ్రంగా విమర్శించింది.
అమెరికా రక్షణశాఖ సహాయ కార్యదర్శి ఎల్‌బ్రిడ్జ్ కోల్బీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ సంచలనాత్మక ప్రకటన చేశారు. “మాటల కన్నా సైనిక శక్తికి ప్రాధాన్యం ఇచ్చే బలమైన కెనడా అందరికీ ఉపయోగపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు కెనడా తన రక్షణ వాగ్దానాల్లో విశ్వసనీయమైన పురోగతి సాధించలేకపోయింది. దీంతో శాశ్వత ఉమ్మడి రక్షణ మండలి (Permanent Joint Board on Defense) ద్వారా వచ్చే ప్రయోజనాలను పునఃపరిశీలించాలని నిర్ణయించాం. ఈ ఉద్దేశ్యంతోనే మండలి నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నాం” అని కోల్బీ స్పష్టం చేశారు.
ఐతిహాసిక నేపథ్యం
1940లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్, కెనడా ప్రధాని మెకెంజీ కింగ్‌లు కలిసి ఈ రక్షణ మండలిని స్థాపించారు. దీనిని ‘ఓగ్డెన్స్‌బర్గ్ ఒప్పందం’గా కూడా పిలుస్తారు. ఉత్తర అమెరికా ఖండ రక్షణ, భద్రతలో ఇరు దేశాలు సన్నిహితంగా కలిసి పనిచేయడానికి ఇది ముఖ్యమైన వేదికగా ఉంది.
ట్రంప్ ఆరోపణలు
చాలా కాలంగా ట్రంప్ కెనడా సహా నాటో దేశాలపై రక్షణ ఖర్చులు తక్కువ చేస్తున్నాయని, భారం అమెరికా మీదనే పడుతోందని ఆరోపిస్తున్నారు. ఇటీవల కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ఉన్న వాణిజ్య వివాదాలు, సుంకాలు, ఇతర అంశాలు కూడా ఉద్రిక్తతలను పెంచాయి. కార్నీ డావోస్ ఎకనామిక్ ఫోరమ్‌లో చేసిన ప్రసంగంలో స్వయం సమృద్ధి వైపు మొగ్గు చూపడం కూడా అమెరికా అసంతృప్తికి కారణమైందని సమాచారం.
అమెరికా ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే కెనడా తరఫున ఎలాంటి అధికారిక ప్రతిస్పందన ఇంకా రాలేదు. ఈ పరిణామం ఉత్తర అమెరికా రక్షణ సహకారంపై కొత్త చర్చలకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

