Shootout at New York : అమెరికాలో కాల్పుల కలకలం… ఐదుగురు మృతి
న్యూయార్క్ సెంట్రల్ మాన్‌హట్టన్‌లో ఘటన

అమెరికాలోని న్యూయార్క్ సెంట్రల్ మాన్‌హట్టన్ ప్రాంతంలో ఒక అపరిచిత వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. స్థానిక మీడియా కధనాల ప్రకారం లాస్ వేగాస్‌కు చెందిన షేన్ తమురా అనే 27 ఏళ్ళ యువకుడు ఈదారుణానికి తెగబడినట్లు చెపుతున్నారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి కూడా తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు వార్తా సంస్ధలు చెపుతున్నాయి. కాల్పుల సంఘటన జరిగిన ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. మిడ్ టౌన్ మాన్‌హట్టన్ పరిసరాల్లో గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్, రాక్‌ఫెల్లర్ సెంటర్ సమీపంలోని ఒక భవనంపైకి షేన్ తమురా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. పెద్దపెద్ద కంపెనీలకు చెందిన కార్పొరేట్ కార్యాలయాలు ఉన్న ప్రాంతం అవడంతో కాల్పుల సంఘటన జరిగిన వెంటనే అధికారలు ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించారు. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కాల్పుల సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. కాల్పుల్లో మృతి చెందిన పోలీస్ అధికారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
