Slovakia: ఉక్రెయిన్‌కు షాకిచ్చిన స్లొవేకియా: అత్యవసర విద్యుత్ సరఫరా నిలిపివేత!
అత్యవసర విద్యుత్ సరఫరా నిలిపివేత!

Slovakia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై రష్యా భీకర దాడులు జరుగుతుండగా, మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లొవేకియా ఉక్రెయిన్‌కు అందిస్తున్న అత్యవసర విద్యుత్ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయానికి కారణం రష్యా నుంచి స్లొవేకియాకు సరఫరా అవుతున్న ముడి చమురు (రష్యన్ ఆయిల్) సరఫరా నిలిచిపోవడమే. డ్రుజ్బా పైప్‌లైన్ ద్వారా ఉక్రెయిన్ భూభాగం మీదుగా మధ్య ఐరోపా దేశాలకు రష్యా చమురు సరఫరా జరుగుతోంది. అయితే జనవరి 27 నుంచి స్లొవేకియా, హంగరీలకు ఈ చమురు సరఫరా ఆగిపోయింది.
ఉక్రెయిన్ అధికారులు రష్యా డ్రోన్ దాడుల వల్ల పైప్‌లైన్ దెబ్బతిన్నట్లు చెప్పగా, స్లొవేకియా మాత్రం ఉక్రెయిన్ ఉద్దేశపూర్వకంగానే చమురు సరఫరాను ఆపేసిందని ఆరోపించింది. పైప్‌లైన్ సరిగ్గా ఉందని, దాన్ని పరిశీలించేందుకు తమ రాయబారికి అనుమతి ఇవ్వలేదని బ్రతిస్లావా పేర్కొంది. ఈ విషయంపై చర్చించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ నిరాకరిస్తున్నారని స్లొవేకియా ఆరోపణలు.
ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యగా అత్యవసర విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ప్రకటించారు. చమురు సరఫరా పునరుద్ధరించే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సరఫరా తిరిగి ప్రారంభం కాకపోతే మరిన్ని తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్ సభ్యత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఉపసంహరిస్తామని ఫికో బెదిరింపు ఇచ్చారు.
స్లొవేకియా, హంగరీలు ఐరోపా సమాఖ్యలో రష్యాకు అనుకూలంగా ఉండే దేశాలుగా ప్రసిద్ధి చెందాయి. మరోవైపు ఈ పరిణామాలపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ, స్లొవేకియా, హంగరీలు సంయమనం పాటించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ వివాదం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచినట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ ఇప్పటికే రష్యా దాడులతో విద్యుత్ సంక్షోభంలో ఉండగా, ఈ నిర్ణయం కీవ్‌కు మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

