Sri Lankan Court: లంచం కేసులో ఇద్దరు భారతీయ డైరెక్టర్లపై అరెస్టు వారెంట్లు జారీ చేయని శ్రీలంక కోర్టు
శ్రీలంక కోర్టు

Sri Lankan Court: లంచం కేసులో శ్రీలంక ప్రతిపక్ష నాయకుడు నమల్ రాజపక్సే రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో, ఒక కంపెనీకి చెందిన ఇద్దరు భారతీయ డైరెక్టర్లపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలన్న అభ్యర్థనను శ్రీలంక కోర్టు తిరస్కరించింది.
క్రిష్ హోటల్స్ అనే భారతీయ పెట్టుబడి ప్రాజెక్టు డైరెక్టర్లు అమిత్ కత్యాల్, రాజేంద్ర ప్రసాద్ గుప్తాలను అరెస్టు చేయాలని లంచం, అవినీతి ఆరోపణల దర్యాప్తు కమిషన్ (సీఐఏబీఓసీ) ప్రాసిక్యూటర్లు కోరారు. శుక్రవారం కొలంబో ప్రధాన మేజిస్ట్రేట్ సాక్ష్యాధారాలు సరిపడా లేవని పేర్కొంటూ వారెంట్లు జారీ చేయడానికి నిరాకరించారు. వారెంట్లు జారీ చేయడానికి సంబంధించిన సాక్ష్యాలతో కూడిన నివేదికను సీఐఏబీఓసీ కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించారు.
ఈ కేసులో భారతీయ పెట్టుబడి ప్రాజెక్టు స్థానిక ఏజెంట్ జనకి సిరివర్ధన, నమల్ రాజపక్సే ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సే పెద్ద కుమారుడైన నమల్ రాజపక్సే 2013లో ఆగిపోయిన హోటల్ ప్రాజెక్టుకు సంబంధించి 70 మిలియన్ శ్రీలంక రూపాయల లంచం తీసుకున్నారని ఆరోపణ. సెప్టెంబర్ 29న ఈ కేసులో ఆయనను అక్టోబర్ 13 వరకు రిమాండ్ చేశారు.
ప్రాజెక్టుకు అవసరమైన ముఖ్య అనుమతులు పొందేందుకు సిరివర్ధన అనేక సార్లు రాజపక్సేకు లంచం ఇచ్చారని సీఐఏబీఓసీ ఆరోపించింది. అప్పట్లో తన తండ్రి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజపక్సే తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి అనుమతులు త్వరగా ఇప్పించారని ప్రాసిక్యూటర్లు అన్నారు. రాజపక్సే మాత్రం ఆ డబ్బు 2014లో కొలంబోలో జరిగిన అంతర్జాతీయ రగ్బీ ఈవెంట్‌కు స్పాన్సర్‌షిప్ అని వాదించారు.
ఆయన మరో $2 మిలియన్ లంచం కేసులో సెప్టెంబర్ 4 నుంచి రిమాండ్‌లో ఉన్నారు. మరో మనీ లాండరింగ్ కేసులో కూడా రిమాండ్ ఆదేశం జారీ అయింది.

