నాటో దేశాలకు ట్రంప్ సూచన

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో కూటమి దేశాలకు కీలక సూచన చేశారు. ఉక్రెయిన్‌తో మూడేళ్లుగా యుద్ధం సాగిస్తున్న రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును నిలిపివేయాలని నాటో దేశాలను కోరారు. నాటో దేశాలన్నీ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే, రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపడంతోపాటు ఆ దేశంపై గట్టి ఆంక్షలు విధించాలని ఆయన పేర్కొన్నారు.

నాటో కూటమి దేశాలు యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో 100 శాతం నిబద్ధత చూపడం లేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం దిగ్భ్రాంతికరమని, ఇది మాస్కోతో చర్చల్లో కూటమి బేరసారాల శక్తిని బలహీనపరుస్తుందని విమర్శించారు. అంతేకాకుండా, రష్యాకు మిత్రదేశమైన చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు విధించాలని నాటో దేశాలకు ట్రంప్ సూచించారు.

ఈ సుంకాలు యుద్ధం ముగిసే వరకు అమలులో ఉండాలని, శాంతి స్థాపన అనంతరం వాటిని పూర్తిగా ఉపసంహరించవచ్చని ఆయన తెలిపారు. చైనాపై భారీ సుంకాలు విధించడం ద్వారా రష్యాపై ఆ దేశం పట్టును బలహీనపరిచి, యుద్ధాన్ని ముగించడంలో కీలక పాత్ర పోషించవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. నాటో దేశాలు తన సూచనలను పాటిస్తే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగిసి, ఇరు దేశాల్లో ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒకవేళ నాటో దేశాలు తన ప్రతిపాదనలను అమలు చేయకపోతే, అది తన సమయాన్ని, అమెరికా ప్రజల డబ్బును వృథా చేయడమేనని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని నాటో దేశాలు కూడా అనుసరించాలని ట్రంప్ కోరారు. నాటో దేశాలు ట్రంప్ ప్రతిపాదనలను ఎంతవరకు అమలు చేస్తాయనేది చూడాల్సి ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story