India Slams Pakistan: అంతర్జాతీయ వేదికపై భారత్‌ను నిందించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ మరోసారి భంగపడింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్ ప్రతినిధికి భారత్ గట్టి బుద్ధి చెప్పింది.

భారత ప్రతినిధి అనుపమా సింగ్ మాట్లాడుతూ, “జమ్మూ కాశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే. ఇక్కడ పరిష్కారం కాని సమస్య ఉంటే అది పాక్ ఆక్రమిత భారత భూభాగాలు (పీవోకే)ను తిరిగి ఇవ్వకపోవడమే” అని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో కొన్ని దశాబ్దాలుగా సైనికుల అక్రమాలు, క్రూరత్వం, బుల్లెట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు కనీస స్వేచ్ఛ కూడా పొందలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఇటీవల రావల్‌కోట్‌లో జరిగిన విషాదాన్ని ఉదహరిస్తూ, ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ ఇవ్వడం తమ ప్రభుత్వ విధానమని పాక్ రక్షణ మంత్రి చెబుతున్నారని, అలాంటి దేశం తాము ఉగ్రవాద బాధితులమని వాపోవడం హాస్యాస్పదమని అనుపమా సింగ్ వ్యాఖ్యానించారు.

“పెంచిన పామే కాటేస్తోంది”

స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక శక్తులను పెంచి పోషించిన పాకిస్థాన్ ఇప్పుడు వాటి కాటుకు బలవుతోందని భారత్ దుయ్యబట్టింది. ఈ సందర్భంగా సింధూ జలాల ఒప్పందం (Indus Water Treaty)పై కూడా స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఉగ్రవాదాన్ని విధానపరమైన సాధనంగా ఎగుమతి చేసే దేశం సద్భావన, స్నేహపూర్వక సంబంధాల లాభాలను ఆశించడం విడ్డూరమని, ఆ ఒప్పందానికి కాలం చెల్లిందని భారత ప్రతినిధి పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

ఈ ఘటన మరోసారి పాకిస్థాన్ యొక్క ఉగ్రవాద మద్దతు విధానాలను అంతర్జాతీయంగా ఎండగట్టింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story