PM Modi: అప్పుడు 4 యూనికార్న్‌లు.. ఇప్పుడు 100కి పైగా: ప్రధాని మోదీ
ఇప్పుడు 100కి పైగా: ప్రధాని మోదీ

PM Modi: సెమీకండక్టర్ రంగంలో భారత్ కీలక ముందడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా హేగ్ నగరంలో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రధాన మంత్రికి భారీ స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులతో కరచాలనం చేసి, సంభాషించారు. నెదర్లాండ్స్ నాయకులతో మాట్లాడినప్పుడల్లా ప్రవాస భారతీయులను ప్రశంసించేవారని మోదీ గుర్తు చేశారు. హేగ్ నగరం భారత్-నెదర్లాండ్స్ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందని కొనియాడారు. కాలం మారినా భారతీయ సంస్కృతి మాత్రం మారలేదని అభినందించారు. ఈయూ దేశాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘‘డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచ అగ్రస్థానంలో ఉంది. నెలకు 20 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఒకప్పుడు భారత్‌లో కేవలం నాలుగు యూనికార్న్ సంస్థలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 100కి పైగా ఉన్నాయి. సెమీకండక్టర్ ప్లాంట్లు నిర్మాణం జరుగుతోంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్స్ తయారవుతున్నాయి. ఏఐ సమ్మిట్, జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించాం’’ అని తెలిపారు.
ఇంకా ‘‘భారత్‌లో 90 కోట్ల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటు వేశారు. ఈయూ దేశాల మొత్తం జనాభా కలిపినా 64 కోట్లు కూడా రాదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
ఈ పర్యటనలో భారత్-నెదర్లాండ్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు సెమీకండక్టర్స్, శుద్ధ ఇంధనం, జల నిర్వహణ, రక్షణ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరుగుతున్నాయి.

