Trump Demand: ట్రంప్ డిమాండ్: మైక్రోసాఫ్ట్‌లో లిసా మోనాకోను వెంటనే తొలగించాలి - జాతీయ భద్రతకు ముప్పుగా ఆరోపణ
జాతీయ భద్రతకు ముప్పుగా ఆరోపణ

Trump Demand: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో ఒక ముఖ్యమైన ఉద్యోగిని తొలగించాలని కోరుతున్నారు (Microsoft to fire Lisa Monaco). ఆమె అమెరికా జాతీయ భద్రతకు గండికొడుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ ఉద్యోగి ఎవరు?
మైక్రోసాఫ్ట్ (Microsoft)లో గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్‌గా లిసా మోనాకో పని చేస్తున్నారు. బరాక్ ఒబామా పాలనలో జాతీయ భద్రతా సీనియర్ అడ్వైజర్‌గా ఆమె సేవలందించారు. జో బైడెన్ అధ్యక్షత్వ కాలంలో (2021-2025) డిప్యూటీ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. హార్వర్డ్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ చికాగో లా స్కూల్‌లో ఉన్నత చదువులు చదివిన లిసా మోనాకో (Lisa Monaco), ఈ సంవత్సరం జులైలో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. "ఆమెను నియమించడం ఆశ్చర్యకరం. ఆమె అత్యంత రహస్య సమాచారానికి యాక్సెస్ ఉన్న సీనియర్ పదవిలో ఉన్నారు. ఆమెను ఆ పదవిలో కొనసాగనివ్వకూడదు" అని ట్రంప్ తన పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.
అమెరికా ప్రభుత్వం మరియు టెక్ కంపెనీల మధ్య ఎన్నో ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి, ఆమె జాతీయ భద్రతకు బెదిరింపుగా మారిందని ట్రంప్ (Donald Trump) అంటున్నారు. ఆమె అనేక చట్టవిరుద్ధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ నుంచి ఎలాంటి సమాచారం పొందకుండా ఆమెపై ఇప్పటికే నిషేధాలు విధించామని ఆయన తెలిపారు. అందుకే మైక్రోసాఫ్ట్ నుంచి ఆమెను తక్షణమే తొలగించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ డిమాండ్‌పై మైక్రోసాఫ్ట్‌ను అడిగినప్పుడు, స్పందించడానికి నిరాకరించిందని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి గురించి అందరికీ తెలిసిందే. అప్పటి డిప్యూటీ అటార్నీ జనరల్‌గా లిసా మోనాకో (Lisa Monaco), బైడెన్ ప్రభుత్వం తరఫున చురుకుగా వ్యవహరించారు. ఆమెకు ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్‌లను (రహస్య సమాచారానికి అనుమతి) ఈ ఫిబ్రవరిలో ట్రంప్ రద్దు చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకే అని అప్పట్లో ఆరోపణలు చేశారు.
