Trump: ట్రంప్ జోరుకు కళ్లెం: సెనెట్‌లో ఎదురుదెబ్బ, కోర్టులో నిషేధం
కోర్టులో నిషేధం

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్యలను అడ్డుకునే యుద్ధ అధికారాల తీర్మానాన్ని సెనెట్ మంగళవారం 50-48 ఓట్ల తేడాతో ఆమోదించింది. యుద్ధాన్ని ఆపాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ తీర్మానం సెనెట్ ముందుకు పదిసార్లు వచ్చినా ఇదే మొదటి ఆమోదం. నలుగురు రిపబ్లికన్ సెనేటర్ల మద్దతుతో ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. ఇటీవల ప్రతినిధుల సభ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ తీర్మానం చట్టబద్ధంగా ఎక్కువ బలం కలిగినది కాదు. అయితే ఇరాన్‌తో యుద్ధం, ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం (MOU)పై కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంతృప్తికి ఇది స్పష్టమైన సంకేతం. ఇరాన్ యుద్ధం వల్ల ఖాళీ అయిన మందుగుండు, ఆయుధాలను తిరిగి నింపుకోవాలంటే 80 బిలియన్ డాలర్లు కావాలని పెంటగాన్ కాంగ్రెస్‌ను కోరుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్రంప్ ఈ ఆమోదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అర్థరహిత చర్య అని, ఇరాన్‌కు తోడ్పాటు, ఓదార్పు ఇచ్చినట్లయిందని ‘ట్రూత్ సోషల్’లో రాశారు. మరోవైపు, దేశంలో ఇళ్ల నిర్మాణానికి ఊతమిచ్చే బిల్లుపై సంతకం చేయకుండా వాయిదా వేశారు. ఫెడరల్ ఎన్నికల్లో ఓటర్ల గుర్తింపు కోసం కఠిన నిబంధనలు విధించే ‘సేవ్ అమెరికా యాక్ట్’ను సెనెట్ ఆమోదిస్తేనే ఆ బిల్లుపై సంతకం చేస్తానని స్పష్టం చేశారు.
కోర్టులో మరో ఎదురుదెబ్బ
బోస్టన్: ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు నుంచి మరో షాక్ తగిలింది. ఓటరు నమోదుకు పౌరసత్వ రుజువు తప్పనిసరి చేసే నిబంధనతోపాటు ఎన్నికల సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులను బుధవారం ఒక ఫెడరల్ జడ్జి శాశ్వతంగా నిరోధించారు. గత ఏడాది తాత్కాలికంగా నిలిపిన ఎన్నికల సంస్కరణలపై ఇప్పుడు శాశ్వత నిషేధం విధించారు. ఎన్నికల నియంత్రణ రాష్ట్రాలు, కాంగ్రెస్‌కు చెందిన అధికారమని, ట్రంప్ చర్యలు అధికార విభజనను ఉల్లంఘిస్తున్నాయని జడ్జి డెనిస్ కాస్పెర్ స్పష్టం చేశారు.
ఈ పరిణామాలు ట్రంప్ పాలనలో అంతర్గత వ్యతిరేకతలు పెరుగుతున్నట్లు సూచిస్తున్నాయి.

