భారత్‌కు ట్రంప్‌ మరో హెచ్చరిక: సుంకాలు పెంచే అవకాశం!

Trump Issues Another Warning to India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్‌ను లక్ష్యంగా చేసుకొని మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఈ అంశంలో భారత్ సహకారం అందించకపోతే అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలు (టారిఫ్‌లు) గణనీయంగా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో మొదలుపెట్టిన ట్రంప్... "మోదీ మంచి వ్యక్తి, ఆయనకు నేను సంతోషంగా లేనన్న విషయం బాగా తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా కీలకం. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే మేం సుంకాలు చాలా త్వరగా పెంచేస్తాం" అని హెచ్చరించారు. శ్వేతసౌధం అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ ఆడియో క్లిప్‌ను పంచుకోవడం గమనార్హం.

రాయిటర్స్ నివేదిక ప్రకారం, "రష్యా చమురు విషయంలో భారత్ మాకు సహాయం చేయకపోతే సుంకాలు పెంచడం తప్పదు" అని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇది భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో వచ్చిన బెదిరింపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలోనూ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలల క్రితం ప్రధాని మోదీ తనతో మాట్లాడి రష్యా చమురు కొనుగోళ్లు ఆపుతామని హామీ ఇచ్చారని ఆయన ప్రకటించి సంచలనం రేకెత్తించారు. అయితే భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకొని రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకు చమురు దిగుమతులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story