General Dan Caine: గత ఐదు నెలలుగా ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘర్షణకు త్వరగా ముగింపు పలకాలని దేశంలోపల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గానికి కీలక సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

‘‘ఇరాన్‌తో యుద్ధం స్వల్పకాలికంగా ఉండాల్సింది. ఇప్పటికే అది ఆ దశను దాటిపోయింది. పశ్చిమాసియాలో ఘర్షణలను మరింత తీవ్రతరం చేసే సైనిక చర్యలు ప్రతికూల ఫలితాలు ఇచ్చే ప్రమాదం ఉంది. కేవలం వైమానిక శక్తితోనే నిర్దేశిత లక్ష్యాలను సాధించలేం. అందుకే ఇకనైనా ఈ యుద్ధం నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలి’’ అని జనరల్ కేన్ ట్రంప్ సలహాదారులకు ప్రైవేటుగా చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆయన ఈ విషయంపై క్యాబినెట్ అధికారులు, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తోనూ చర్చలు జరిపారు.

అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌లో భూతల దాడులకు విముఖత చూపుతున్నారు. దానికి బదులుగా వైమానిక దాడులను మరింత పెంచుతామని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ హెచ్చరికలతో ఇరాన్‌ను ఒప్పందానికి తీసుకురావచ్చని ఆయన విశ్వసిస్తున్నారు. అయితే సుదీర్ఘకాలం వైమానిక దాడులు కొనసాగడంతో అమెరికా ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఇప్పటికే 80 శాతం మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్‌సెప్టర్లు, దాదాపు సగం పేట్రియాట్ క్షిపణులు ఖర్చయినట్లు ఇటీవల నివేదికలు వచ్చాయి.

ఈ విషయాలను ట్రంప్ కొట్టిపారేశారు. తమ వద్ద పెద్ద ఎత్తున ఆయుధ నిల్వలు ఉన్నాయని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ప్లాంట్లు, ఫ్యాక్టరీలను రక్షణ రంగ కంపెనీలు నిర్మిస్తున్నాయని తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే క్షిపణుల సంఖ్య గురించి ఆయన కచ్చితమైన లెక్కలు చెప్పకపోవడం గమనార్హం.

ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం మరింత పొడిగిస్తే అమెరికాకు తీవ్ర నష్టాలు కలగవచ్చని సైనిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ట్రంప్ పరిపాలన ఈ సలహాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story