ట్రంప్‌ రూ.217 కోట్ల సెటిల్‌మెంట్‌ ఒప్పందం!

Trump Deal with YouTube: నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడి ఘటనలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలను సస్పెండ్‌ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఎక్స్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఆయన ఖాతాలపై నిషేధం విధించాయి. దీనిపై ట్రంప్‌ ఆయా కంపెనీలపై కోర్టులో దావా వేశారు. ఇప్పుడు ఈ కేసులను పరిష్కరించుకునేందుకు సంబంధిత సంస్థలు ట్రంప్‌తో సెటిల్‌మెంట్‌కు సిద్ధమవుతున్నాయి. తాజాగా గూగుల్‌ యాజమాన్యంలోని యూట్యూబ్‌ కూడా 24.5 మిలియన్‌ డాలర్లు (భారత్‌లో రూ.217 కోట్లకు మించి) చెల్లించి ఈ వివాదాన్ని ముగించేందుకు అంగీకరించింది.

కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం, ఈ మొత్తంలో 22 మిలియన్‌ డాలర్లను నేషనల్‌ మాల్‌ ట్రస్ట్‌కు అందజేస్తారు. మిగిలిన మొత్తాన్ని అమెరికన్‌ కన్జర్వేటివ్‌ యూనియన్‌తో పాటు ఇతర సంస్థలకు చెల్లిస్తారు. ఈ ఒప్పందాన్ని గూగుల్‌ సంస్థ కూడా ధ్రువీకరించింది. ఇటీవలే మెటా, ఎక్స్‌ కంపెనీలు కూడా ట్రంప్‌తో సెటిల్‌మెంట్‌ చేసుకున్నాయి. మెటా 25 మిలియన్‌ డాలర్లు, ఎక్స్‌ 10 మిలియన్‌ డాలర్లు చెల్లించి కేసులను ముగించాయి.

2021లో ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంపై దాడి చేసిన నేపథ్యంలో ఆయన ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను సస్పెండ్‌ చేశారు. తర్వాత 2023లో ఆ ఖాతాలను పునరుద్ధరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story