Trump Sensation: ట్రంప్ సంచలనం: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని తానే అంటూ పోస్ట్
నెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని తానే అంటూ పోస్ట్

Trump Sensation: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనానికి తెరలేపారు. తనను తాను వెనెజువెలా దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ విషయాన్ని తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ ఎడిటెడ్ చిత్రాన్ని పోస్ట్ చేసి తెలిపారు. వికీపీడియా పేజీలా కనిపించే ఆ చిత్రంలో ట్రంప్ ఫొటో క్రింద, ఈ ఏడాది జనవరి నుంచి వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పేరుతో అమెరికా వెనెజువెలాపై దాడులు చేసిన విషయం తెలిసిందే. రాజధాని కారకాస్‌లో అమెరికా సైనిక బలగాలు దిగి, అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌లను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించాయి. ఈ ఘటనల తర్వాత వెనెజువెలా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని ఆ దేశ రక్షణ మంత్రి ప్రకటించారు.
అయితే, వెనెజువెలా పూర్తి అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టాలన్న దానిపై అనిశ్చితి నెలకొంది. విపక్ష నేత, నోబెల్ బహుమతి గ్రహీత మచాడోను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా, ట్రంప్ ఆమెకు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడలేదు. మచాడోకు ప్రజల్లో తగిన మద్దతు లేదని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తానే తాత్కాలిక అధ్యక్షుడినంటూ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.

