Trump Warns Iran: ఇరాన్‌పై మరింత భీకర దాడులు చేస్తాం: ట్రంప్ హెచ్చరిక
ట్రంప్ హెచ్చరిక

Trump Warns Iran: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు బలమైన హెచ్చరిక ఇచ్చారు. ఇప్పటి వరకు ఇరాన్‌పై జరిగిన దాడులు కేవలం ‘ట్రైలర్’ మాత్రమేనని, త్వరలో పూర్తి ‘సినిమా’ చూపిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
నతాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వతం (Pickaxe Mountain) కింద ఇరాన్ రహస్య భూగర్భ అణు సైట్‌ను తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిందని ట్రంప్ ఆరోపించారు. ఈ సైట్‌పై భీకర దాడులు చేసి పూర్తిగా నాశనం చేస్తామని, ఇరాన్ మళ్లీ అణ్వాయుధాల తయారీకి పాల్పడకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 1,000 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం ఉందని, దాన్ని ఉపయోగించి అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని యత్నిస్తోందని ట్రంప్ తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ సైట్‌ను ధ్వంసం చేసి యురేనియం స్టాక్‌ను స్వాధీనం చేసుకోవడానికి త్వరలో సైనిక చర్యలు చేపడతామని హెచ్చరించారు. యుద్ధం కొనసాగితే ఇరాన్‌లో తీవ్ర విధ్వంసం తప్పదని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
ఈలోపు అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టెహ్రాన్‌తో సహా ఇరాన్‌లోని అనేక నగరాల్లో భారీ పేలుళ్లు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సెంటర్లు, డ్రోన్ స్టోరేజ్ సైట్లు, పౌర నివాసాలు, చాబహార్ పోర్టు వంటి ప్రాంతాలపై అమెరికా బాంబు, క్షిపణి దాడులు చేస్తోంది.
ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఖతార్, కువైట్, బహ్రెయిన్‌లపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇంతలోనే పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో శాంతి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇరాన్ మంత్రి మొమేనీ పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో భేటీ అయి, మొజ్తబా ఖమేనీ రహస్య సందేశాన్ని అందించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటన ప్రకారం ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం ఖర్చు ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 3.6 లక్షల కోట్లు) చేరుకుంది.

