నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను కదా!

Trump’s Frustration: నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆశలు పెట్టుకున్నారు. ఈ అవార్డు ప్రకటన రానున్న నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒబామా ఏమీ చేయకుండానే అవార్డు పొందాడని, అమెరికాను నాశనం చేసినందుకే ఇచ్చారని విమర్శించారు. అయితే, తాను ఎనిమిది యుద్ధాలు ఆపి, అనేక మంది ప్రాణాలు కాపాడానని, అయినా తనకు ఇవ్వకపోవచ్చని ఆవేదన చెందారు.

గురువారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజా ప్రాంతంలో శాంతి నెలకొల్పడం సహా ఎనిమిది యుద్ధాలను ఆపడంలో తాను విజయం సాధించానని పేర్కొన్నారు. అయినా, నోబెల్ కమిటీ తనకు అవార్డు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ‘ఒబామా ఏమీ చేయలేదు. అతను అమెరికాను నాశనం చేశాడు. అయినా, ఏమీ చేయకుండానే అతనికి నోబెల్ ఇచ్చారు. అది ఎందుకిచ్చారో అతనికి కూడా తెలియదు. కానీ, నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. ఇంతకు ముందు ఎవరూ చేయలేదు. అయినా వారు ఏమీ చేయరు. నాకు తెలుసు వారు ఏమీ చేయరని. అయితే, నేను ఈ పనులు అవార్డు కోసం చేయలేదు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చేశాను’ అని ట్రంప్ అన్నారు. 2009లో ఒబామా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.

రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ నోబెల్ బహుమతి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీర్ఘకాలిక యుద్ధాలు, ఘర్షణలను ఆపానంటూ స్వయంగా ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యాధిపతి మునీర్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వంటి వారు ట్రంప్ పేరును నోబెల్ నామినేషన్‌కు పంపించారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ఈరోజు వెలువడనుంది. ఈ సమయంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరం.

Updated On 10 Oct 2025 1:04 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story