Trump’s Tariff Strategies: భారత్‌తో ‘మసాలా డీల్’ సాధించేందుకు ట్రంప్ టారిఫ్ వ్యూహాలు
ట్రంప్ టారిఫ్ వ్యూహాలు

Trump’s Tariff Strategies: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) భారత్‌పై హఠాత్తుగా అక్కసు వెళ్లగక్కడం ఓ వ్యూహంగా భాగమేనని తెలుస్తోంది. ఒక దశలో ఆయన ఐరోపా సమాఖ్య (EU)ని కూడా భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు విధించాలని డిమాండ్ చేశారు. మాస్కోను శిక్షించాలంటే ఈ విధంగా చేయాలని వింత వాదనను వినిపించారు. అయితే, ఆ తర్వాత ప్రధాని మోదీ (PM Modi) తన మిత్రుడని, భారత్‌తో ఓ ఒప్పందం కుదురుతుందని స్వరం మార్చారు. గతంలో కూడా అమెరికా ఇటువంటి వైఖరిని అనుసరించిన సందర్భాలు భారత్ చూసింది. ఒక చేతిలో క్యారెట్, మరో చేతిలో కర్ర పట్టుకున్నట్లుగా ట్రంప్ వ్యవహారశైలి ఉంది. భారత్‌తో తియ్యటి కబుర్లు చెబుతూనే, ఐరోపా సమాఖ్యను ఉసిగొల్పే విధంగా వ్యవహరిస్తున్నారు.
ట్రంప్ (Donald Trump) మాటలను నిజమని నమ్మడం ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్-అమెరికా వాణిజ్య చర్చలు (India USA Trade Talks) సరళంగా సాగుతుండగా, ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనల వల్ల అవి సంక్లిష్టంగా మారాయని వారు అభిప్రాయపడ్డారు. ఐరోపా సమాఖ్యను ఉసిగొల్పడం, భారత్‌తో చర్చలు జరుపుతానని చెప్పడం, టారిఫ్‌లను 50 శాతానికి పెంచడం వంటివి దీనికి ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. భారత్‌ను ‘మసాలా డీల్స్’ (MASALA Deals - Mutually Agreed Settlements Achieved through Leveraged Arm-Twisting) ఉచ్చులోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని నివేదికలు వెల్లడించాయి. అంటే, అధికార బలంతో ఒత్తిడి చేసి పరస్పర అంగీకారంతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చేయడం. ఇటువంటి ఒప్పందాలు భారత్‌కు ఎటువంటి ప్రయోజనం చేకూర్చవని, ట్రంప్ చేష్టలను తాత్కాలికంగా ఆపడానికి మాత్రమే ఉపయోగపడతాయని, దీనివల్ల భారత ఎగుమతిదారులు బలి కావాల్సి వస్తుందని, భవిష్యత్తులో వాషింగ్టన్ కుట్రలకు మరింత సులభంగా బాధితులవుతారని నివేదికలు హెచ్చరించాయి.
నాడు జీటీఆర్‌ఐ ఏం చెప్పిందంటే..
ట్రంప్ కార్యవర్గం, ముఖ్యంగా భారత్‌లో వ్యవసాయ రంగంలో వాటా కోసం తీవ్ర ఒత్తిడి చేస్తుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చి ఇనిషియేటివ్ (GTRI) జులైలో ఒక నివేదిక విడుదల చేసి హెచ్చరించింది. ట్రంప్ కార్యవర్గం ఆశిస్తున్న డీల్స్ రాజకీయంగా అస్థిరమైనవి, ఆర్థికంగా వినాశకరమైనవని పేర్కొంది. ఇవి అంగీకరిస్తే కోలుకోలేని నష్టం జరుగుతుందని తెలిపింది.
ముఖ్యంగా, ట్రంప్‌కు ఇష్టమైన మసాలా డీల్స్ ఏకపక్షంగా ఉంటాయని జీటీఆర్‌ఐ హెచ్చరించింది. ఈ డీల్స్ భాగస్వామ్య దేశాలు అమెరికా వస్తువులపై టారిఫ్‌లను తగ్గించేలా చేస్తాయి, కానీ భారత్‌కు ఎటువంటి రాయితీలు అందవని, భవిష్యత్తులో మళ్లీ టారిఫ్‌లు విధించరని హామీ లేదని వెల్లడించింది. ఈ డీల్స్ దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం కాక, తాత్కాలిక రాజకీయ లక్ష్యాల కోసమే ఉద్దేశించినవని పేర్కొంది. భారత్ మాత్రమే కాదు, ట్రంప్ నుంచి ఇలాంటి ఒత్తిడి బెదిరింపులను ఎదుర్కొన్న దేశాలు డజన్ల సంఖ్యలో ఉన్నాయని జీటీఆర్‌ఐ తెలిపింది.
ఇటువంటి మసాలా డీల్స్‌ను నివారించాలంటే, అమెరికా మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, ఔషధాలు, ఆటోమొబైల్ ఉత్పత్తులకు ఎంత అవకాశం ఉందో ముందుగా స్పష్టత తెచ్చుకోవాలి. టారిఫ్‌ల పెంపు ఇప్పటికే ఎగుమతులు, జీడీపీ అంచనాలపై ప్రభావం చూపుతోంది. చర్చలు జరిపే బృందం ప్రస్తుత టారిఫ్‌లను ఉపసంహరించేలా, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలు, బలమైన మార్కెట్ అవకాశాలను సాధించేందుకు ఒత్తిడి చేయాలి. లేకపోతే, ట్రంప్ ఒక్క పోస్ట్‌తో భారత్‌కు అందే ప్రతి రాయితీని రద్దు చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్ విషయంలో ఈయూ ట్రంప్‌ను పట్టించుకోకపోవచ్చు..!
భారత్ (India) బృందం 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చేలా ప్రయత్నాలు చేయాలి. ఈ క్రమంలో అమెరికా విధించిన నాన్-టారిఫ్ చర్యలను కూడా పరిష్కరించుకోవాలి. కస్టమ్స్ వాల్యుయేషన్ నిబంధనలు, దిగుమతి లైసెన్స్‌లు, వాణిజ్య సంబంధిత పెట్టుబడి సమస్యలు వంటివి ఈ చర్చల్లో పరిష్కారం కావాలి. ఈ ఒప్పందం భారత్ ఆర్థిక శక్తి, లౌక్యానికి చిహ్నంగా నిలవాలి. ట్రంప్‌కు ఇతర దేశాలతో ఆటలాడటం సరదాగా ఉండవచ్చు, కానీ వాషింగ్టన్ నుంచి వచ్చే అనూహ్య మార్పులకు భారత్ ఇబ్బందిపడటం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
