అమెరికా కంపెనీలపై రూ.1.23 లక్షల కోట్ల భారీ భారం!

H-1B Visa Decision: అమెరికాలోని టెక్‌ కంపెనీలు హెచ్‌1బీ వీసాల కోసం ఇకపై ఏటా 14 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.23 లక్షల కోట్లు) వెచ్చించాల్సి రావచ్చు. హెచ్‌1బీ వీసా ఫీజును భారీగా పెంచి ఒక్కో వీసాకు లక్ష డాలర్లుగా నిర్ణయించడం కంపెనీలకు భారమైన భారంగా మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. ఈ కొత్త ఫీజు నియమం ఫిబ్రవరిలో లాటరీ ద్వారా రానున్న కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది.

అమెరికన్‌ ఉద్యోగులను నియమించుకునేలా కంపెనీలపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్నారు. గత ఏడాది మొత్తం 1,41,000 హెచ్‌1బీ వీసాలు జారీ అయినట్లు అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇదే స్థాయిలో వీసాలు జారీ అయితే, వీటి కోసం కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం ఫీజు 14 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేయబడింది. ఈ నిర్ణయం స్టార్టప్‌ సంస్థలకు తీవ్రమైన ఆఘాతమని వై కాంబినేటర్‌ సీఈవో గారీటాన్‌ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం విదేశీ టెక్‌ హబ్‌లకు ఒక బహుమతిగా మారిందని, దీనివల్ల అమెరికా స్టార్టప్‌లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇమిగ్రేషన్‌ శాఖ స్పష్టతతో ఆందోళన తగ్గింది: నాస్‌కామ్‌

ట్రంప్‌ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశం ఉందని ఒక న్యాయవాది తెలిపారు. ఈ వీసా ఫీజు పెంపు నిర్ణయం అధికార పరిధిని మీరినట్లు ఉందని, దీన్ని కోర్టులు అడ్డుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. హెచ్‌1బీ వీసాలకు కనీస వేతన పెంపు వంటి విస్తృత మార్పులపై ట్రంప్‌ కార్యవర్గం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు రిపబ్లికన్‌ చట్టసభ సభ్యులు లాటరీ విధానాన్ని తొలగించి, జీతాల ఆధారంగా వీసాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story