రష్యాకు రాయితీలు ఇవ్వాలంటూ ఉక్రెయిన్‌ అధినేతపై ఒత్తిడి

Trump–Zelensky Meeting: అమెరికా అధ్యక్షుని నివాసమైన శ్వేతసౌధంలో శుక్రవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీకి అసహ్యకరమైన అనుభవం ఎదురైంది. రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతిపాదనలకు అంగీకరించి, డాన్‌బాస్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని, యుద్ధాన్ని త్వరగా ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జెలెన్‌స్కీపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. బహిరంగంగా ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం చేస్తానని ప్రకటించిన ట్రంప్‌, ప్రైవేట్‌ సమావేశంలో మాత్రం పుతిన్‌కు మద్దతుగా మాట్లాడటంతో జెలెన్‌స్కీ ఆశ్చర్యపోయారు. ఈ ఒప్పందానికి సమ్మతించకపోతే రష్యా ఉక్రెయిన్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తుందని ట్రంప్‌ హెచ్చరించినట్లు సమాచారం. ఈ సమావేశ విశేషాలను ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది.

ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య చర్చలు ఉద్రిక్తంగా సాగాయి. ఒకానొక దశలో ఇద్దరూ గట్టిగా మాట్లాడుకున్నారని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. యుద్ధ ప్రాంతాల్లో పరిస్థితిని వివరిస్తూ ఉక్రెయిన్‌ బృందం చూపించిన మ్యాప్‌లను ట్రంప్‌ పట్టించుకోకుండా, డాన్‌బాస్‌ను రష్యాకు ఇచ్చేయాలని పట్టుబట్టారు. పుతిన్‌ ఇష్టమొచ్చినట్లు చేస్తాడు, మిమ్మల్ని నాశనం చేయగలడని ట్రంప్‌ బెదిరించారు. రష్యా ఆర్థికంగా బలంగా ఉందని కూడా ఆయన జెలెన్‌స్కీకి చెప్పారు. ఈ కథనంపై శ్వేతసౌధం లేదా ఉక్రెయిన్‌ బృందం ఎలాంటి స్పందనా తెలపలేదు.

జెలెన్‌స్కీతో భేటీకి ముందు ట్రంప్‌, పుతిన్‌ మధ్య ఫోన్‌లో సుదీర్ఘ చర్చ జరిగిందని, అందులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని శ్వేతసౌధం అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక తెలిపింది. డాన్‌బాస్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం దాదాపు 11 సంవత్సరాలుగా ప్రయత్నిస్తోంది. తాజాగా దీనిని తమకు అప్పగించాలని పుతిన్‌ డిమాండ్‌ చేయడంతో యుద్ధం కొనసాగుతోంది.

ఈ ఏడాది మార్చిలో అమెరికా-ఉక్రెయిన్‌ మధ్య ఖనిజాల ఒప్పందం సమయంలో ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య మీడియా ముందు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అప్పటి సమావేశం, విందు రద్దయ్యాయి. అప్పుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య తక్షణమే కాల్పుల విరమణ జరగాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. శాంతి చర్చలకు జెలెన్‌స్కీ సిద్ధంగా లేడని ఆరోపించారు. కొన్నాళ్ల తర్వాత ఇరువురూ శాంతించారు. మళ్లీ ఖనిజాల ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ప్రారంభమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story