United Kingdom: వీసా ఫీజులు పెంచిన బ్రిటన్ – ప్రయాణికులపై భారం
ప్రయాణికులపై భారం

సెటిల్మెంట్, స్పాన్సర్ లైసెన్స్ ఫీజులు కూడా పెరుగుతాయి.. విద్యార్థులు, పర్యాటకులపై ఆర్థిక భారం
United Kingdom: బ్రిటన్‌కు పర్యాటకం, ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లే వారిపై ఇకపై మరింత ఆర్థిక భారం పడనుంది. స్టూడెంట్, విజిటర్ తదితర అన్ని కేటగిరీల వీసా ఫీజులతో పాటు సెటిల్మెంట్ (ILR), స్పాన్సర్ లైసెన్స్ ఫీజులను కూడా పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. హోమ్ ఆఫీస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం దరఖాస్తు రుసుములు సుమారు 6 నుంచి 7 శాతం పెరగనున్నాయి.
కొత్త రేట్ల ప్రకారం మూడేళ్ల స్కిల్డ్ వర్కర్ వీసా దరఖాస్తు రుసుము 769 పౌండ్ల నుంచి 819 పౌండ్లకు (సుమారు రూ.1,02,470) పెరుగుతుంది. మూడేళ్లకు పైగా ఉండే దరఖాస్తుల రుసుము 1,519 పౌండ్ల నుంచి 1,618 పౌండ్లకు (సుమారు రూ.2,02,437) పెరుగుతుంది. విద్యార్థి వీసా ఫీజు 524 పౌండ్ల నుంచి 558 పౌండ్లకు (సుమారు రూ.69,814) పెరగనుంది. ఆరు నెలల విజిటర్ వీసా ఛార్జీ 127 పౌండ్ల నుంచి 135 పౌండ్లకు (సుమారు రూ.16,890) పెరుగుతుంది.
సెటిల్మెంట్ (ఇన్‌డెఫినిట్ లీవ్ టు రిమైన్ - ILR) దరఖాస్తు రుసుము £3,029 నుంచి £3,226కు పెరుగుతుంది. స్పాన్సర్ లైసెన్స్ ఫీజుల్లో కూడా మార్పులు ఉన్నాయి. చిన్న స్పాన్సర్ లైసెన్స్ ఫీజు £574 నుంచి £611కు, పెద్ద స్పాన్సర్ లైసెన్స్ £1,579 నుంచి £1,682కు పెరుగుతుంది. ఇది ఉద్యోగ యజమానులు, విద్యా సంస్థలపై ప్రభావం చూపనుంది.
ఈ ఫీజు పెంపు వల్ల బ్రిటన్‌కు వెళ్లాలనుకునే భారతీయులు, విద్యార్థులు, పర్యాటకులు, స్కిల్డ్ వర్కర్లు ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మార్పులు ఇమ్మిగ్రేషన్ సేవల నాణ్యతను మెరుగుపరచడం, ఖర్చులను భర్తీ చేయడం కోసమే అని హోమ్ ఆఫీస్ వెల్లడించింది.

