Donald Trump Immigration Policies: అమెరికా పట్టణ (మెట్రో) ప్రాంతాల్లో జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోయిందని యూఎస్ సెన్సస్ బ్యూరో తాజా గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా యూఎస్-మెక్సికో సరిహద్దు ప్రాంతాల్లోని కమ్యూనిటీలు, ఫ్లోరిడా తీరప్రాంతాల్లోని కౌంటీల్లో జనాభా పెరుగుదల నెమ్మదించింది. 2024లో మెట్రో ప్రాంతాల్లో సగటు వృద్ధి రేటు 1.1 శాతం ఉండగా, 2025లో అది 0.6 శాతానికి పడిపోయింది.

ఈ పతనానికి ప్రధాన కారణం వలసల తగ్గుదలేనని సెన్సస్ అధికారులు అంచనా వేశారు. 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కఠినమైన వలస విధానాలు అమలు చేయడం వల్ల వలసదారుల సంఖ్య తగ్గిందని స్పష్టమవుతోంది. రెండు దశాబ్దాలుగా అమెరికాలో పెరుగుతున్న వృద్ధ జనాభా, తగ్గుతున్న జననాల రేటును వలసలు సమతుల్యం చేస్తున్నాయని, ఆ వలసలు తగ్గడం వల్ల పట్టణాల్లో వృద్ధి మందగించిందని డెమోగ్రాఫర్ కెన్నెత్ జాన్సన్ వివరించారు.

“ఒక ప్రాంతం వృద్ధి చెందాలంటే వలసలపై ఆధారపడి ఉంటుంది. వలసలు ఎక్కువగా ఉండే మెట్రో ప్రాంతాల్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది” అని ఆయన అన్నారు.

అంతేకాకుండా, 2024లో ఫ్లోరిడా తీరప్రాంతాలను ‘హెలెన్’, ‘మిల్టన్’ తుఫానులు తీవ్రంగా ప్రభావితం చేశాయి. భారీ ఆస్తి నష్టం, ప్రకృతి విపత్తు కారణంగా వేలాది మంది స్థానికులు తీర ప్రాంతాలను వదిలి వెళ్లడం కూడా జనాభా తగ్గడానికి ఓ కారణమని సెన్సస్ బ్యూరో పేర్కొంది.

ఈ గణాంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ, నగరాల అభివృద్ధి, లేబర్ మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ట్రంప్ పాలనలో వలసలపై కఠిన వైఖరి కొనసాగితే రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ మరింత తీవ్రమవుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story