Iran Oil Exports: పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ బుధవారం (అమెరికా సమయం ప్రకారం) ఈ ఆంక్షలను ప్రకటించారు. ఇటీవల ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి అమెరికా విధించిన కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా సడలించిన సంగతి తెలిసిందే. ఆ సడలింపును పొడిగించేది లేదని బెసెంట్ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఇరాన్ చమురు ఎగుమతులతో ముడిపడి ఉన్న అనేక వ్యక్తులు, చమురు సంస్థలు, నౌకలపై కొత్త ఆంక్షలు విధించినట్లు యూఎస్ ట్రెజరీ శాఖ విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (ఓఎఫ్‌ఏసి) ప్రకటించింది. ఆంక్షలకు గురైనవాటిలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రాజకీయ సలహాదారుడి కుమారుడు మహమ్మద్ హుస్సేన్ షమ్‌ఖానీ నేతృత్వంలోని నెట్‌వర్క్‌లు కూడా ఉన్నాయి.

ఫిబ్రవరి నెలలో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ సలహాదారుడు ప్రాణాలు కోల్పోయిన విషయం గుర్తుంచుకోవాలి. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల రాకపోకలను అమెరికా దిగ్బంధించే చర్యలు కూడా ముమ్మరం చేస్తోంది.

ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఈ ఆంక్షల ప్రభావం తప్పనిసరిగా పడనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గడం వల్ల అంతర్జాతీయ చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి తెచ్చేలా ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story