తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

United States: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా ట్రంప్‌ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌ చమురు (Iranian oil) అమ్మకాలపై ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్‌ చమురుకు 30 రోజుల మినహాయింపు (waiver) జారీ చేసింది.

అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ ఈ ప్రకటన చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాను పెంచడమే ఈ నిర్ణయం లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ తాత్కాలిక చర్య ద్వారా సుమారు 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్‌ చమురు ప్రపంచ మార్కెట్లలోకి విడుదలవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే సముద్రంలో (stranded at sea) నిలిచిపోయిన ఇరాన్‌ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయం, డెలివరీకి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంపై ఇరాన్‌ స్పందించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేయడానికి తమ వద్ద అదనపు ముడి చమురు లేదని టెహ్రాన్‌ పేర్కొంది. ఇరాన్‌ ఇంధన మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎక్స్‌ (X)లో పోస్టు చేస్తూ.. చమురు సరఫరాపై ఆందోళనలను తగ్గించడమే అమెరికా ఈ ప్రకటన చేసిన ఉద్దేశ్యమని వ్యాఖ్యానించారు.

ఇటీవలి రోజుల్లో ఇరాన్‌ యుద్ధం కారణంగా స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌లో షిప్పింగ్‌ ప్రభావితమైంది. దీంతో ప్రపంచ చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇలాంటి తాత్కాలిక మినహాయింపులు జారీ చేస్తోంది. ఇది గత రెండు వారాల్లో మూడోసారి ఇలాంటి చర్య అని తెలుస్తోంది. ఈ విధంగా ఇంధన సరఫరా సమస్యలను తగ్గించి, మార్కెట్‌లను స్థిరపరచాలని వాషింగ్టన్‌ భావిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story