రెవరెండ్ జెస్సీ జాక్సన్ కన్నుమూత

US Civil Rights Leader Reverend Jesse Jackson: అమెరికాలో జాతి వివక్ష, శ్వేత దురహంకారానికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు పోరాడిన ప్రముఖ పౌరహక్కుల నాయకుడు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనుచరుడు రెవరెండ్ జెస్సీ ఎల్. జాక్సన్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.

జెస్సీ జాక్సన్ తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య శాంతియుతంగా కన్నుమూశారని ఆయన కుమార్తె సంతితా జాక్సన్ తెలియజేశారు. మార్టిన్ లూథర్ కింగ్ హత్య తర్వాత ఆయన వారసుడిగా తనను తాను ప్రకటించుకున్న జాక్సన్, అమెరికాతో పాటు పలు దేశాల్లో నిరుపేదలు, వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేశారు.

నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడటం, నల్లజాతీయులకు సమాన హక్కులు, గౌరవం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మార్టిన్ లూథర్ కింగ్ తర్వాత అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.

"పీడితులు, తాడితులకు సేవ చేసిన నాయకుడు మా తండ్రి. నిరుపేదలకు గొంతుకైన నేత. న్యాయం, సమానత్వం, ప్రేమ కోసం ఆయన ఎంచుకున్న మార్గం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది" అని జాక్సన్ కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

మెదడుకు సంబంధించిన వ్యాధి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, ఆయన చివరి వరకూ క్రియాశీలంగా నిరసనలు, ప్రదర్శనల్లో పాల్గొనేవారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000లో ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' ప్రదానం చేశారు.

జెస్సీ జాక్సన్ రెండుసార్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, పౌరహక్కుల ఉద్యమంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణంతో అంతర్జాతీయంగా పౌరహక్కుల రంగంలో ఒక యుగం ముగిసినట్లయింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story