Senator Jim Banks Raises Alarm: యుఎస్: భారత్, చైనా నుంచి నాణ్యత లోపభూయిష్ట ఔషధాలు: అమెరికా సెనెటర్ ఆందోళన
అమెరికా సెనెటర్ ఆందోళన

Senator Jim Banks Raises Alarm: అమెరికాకు భారత్, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలు నాణ్యత లోపంతో ఉన్నాయని యుఎస్ సెనెటర్ జిమ్ బ్యాంక్స్ ఆరోపించారు. విదేశీ ఔషధ తయారీ యూనిట్లపై తనిఖీలను మరింత తీవ్రతరం చేయాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)ను ఆయన కోరారు. ఎఫ్‌డీఏ కమిషనర్ మార్టిన్ మకారీకి రాసిన లేఖలో ఈ విదేశీ మందులపై తన ఆందోళనలను వ్యక్తపరిచారు. ఔషధాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల అమెరికా ప్రజలు ప్రమాదాల్లో పడే అవకాశముందని హెచ్చరించారు. దేశీయ ఔషధ సరఫరాను సురక్షితంగా ఉంచేందుకు అదనపు చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశీ ఔషధ కర్మాగారాల్లో తనిఖీలను విస్తరించాలని కోరారు.
తయారీ దశలోనే నాణ్యత లోపాలను గుర్తించడం ద్వారా అమెరికాలోకి అటువంటి మందులు ప్రవేశించకుండా నిరోధించవచ్చని సెనెటర్ బ్యాంక్స్ తన లేఖలో తెలిపారు. ఇటీవల ఎఫ్‌డీఏ విడుదల చేసిన డేటా ప్రకారం, అమెరికాకు వచ్చే ఔషధాల్లో 39 శాతం చైనా నుంచి, 13 శాతం భారత్ నుంచి, 10 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. అయితే, ఈ దిగుమతి మందులను పూర్తి స్థాయిలో పరీక్షించడం లేదని బ్యాంక్స్ ఆరోపించారు. భారతీయ ఔషధ తయారీ సంస్థలు 13 శాతం ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ నివేదికలు చూపిస్తున్నాయని పేర్కొన్నారు.
దేశీయ ఔషధ తయారీని ప్రోత్సహించేందుకు ప్రీ-చెక్ కార్యక్రమాన్ని అమలు చేయాలని బ్యాంక్స్ ఎఫ్‌డీఏను కోరారు. అమెరికా ఆధారిత ఔషధ సంస్థల ఆమోదాలు, సౌకర్యాలు, తనిఖీలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్త ఔషధ సరఫరా గొలుసులో పారదర్శకత, నాణ్యతను మెరుగుపరచడానికి ఉత్పత్తిదారులు తీసుకుంటున్న చర్యలు, తనిఖీలు, పర్యవేక్షణలకు సంబంధించిన వివరాలతో నవంబర్ 7 నాటికి వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
