లీక్ అయిన పాక్ దౌత్య సమాచారం సంచలనం

Imran Khan’s Removal as Pakistan PM: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించడంలో అమెరికా ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని వెల్లడించే రహస్య దౌత్య సమాచారం తాజాగా లీక్ అయింది. ఈ సంచలనాత్మక పత్రాన్ని ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ పత్రిక ‘డ్రాప్ సైట్’ ప్రచురించింది.

2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ తీర్మానానికి ముందు అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్‌తో అమెరికా విదేశాంగ శాఖలోని దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ జరిపిన సమావేశంలో కీలక చర్చలు జరిగినట్లు లీక్ అయిన దస్తావేజులో వెల్లడైంది. ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించి జైలు చేయాలని, అప్పుడే అమెరికా-పాక్ సంబంధాలు మరింత బలపడతాయని ఆ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడంతో షెహబాజ్ షరీఫ్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇమ్రాన్ ఖాన్ తటస్థ వైఖరి తీసుకోవడం కూడా ఆయన తొలగింపుకు కారణమని లీక్ అయిన దౌత్య సమాచారం సూచిస్తోంది.

అవిశ్వాస తీర్మానానికి ముందు ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించి, తనను పదవి నుంచి తొలగించడానికి అమెరికా స్థానిక పార్టీలు, అధికారులతో కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను పాక్ ప్రభుత్వం, అమెరికా రెండూ తీవ్రంగా ఖండించాయి. తర్వాత తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు జైలు శిక్ష విధించారు. నాటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.

ఈ లీక్ పాకిస్థాన్ రాజకీయాల్లో మరోసారి సంచలనం సృష్టించే అవకాశం ఉంది.

Next Story