US-Iran Sign Peace Agreement: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం: యుద్ధానికి ముగింపు!
యుద్ధానికి ముగింపు!

US-Iran Sign Peace Agreement: అమెరికా-ఇరాన్ మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తతలు, యుద్ధం ముగిసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ డిజిటల్‌గా లాంఛనంగా సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం 14 అంశాలతో కూడిన ‘ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ బీట్వీన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్’ పేరుతో ఉంది. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఘాలిబఫ్ కూడా ఈ ఎంఓయూ (MoU) పై సంతకాలు చేశారు. తాజాగా ఇరు దేశాల అధ్యక్షుల సంతకాలతో ఈ డీల్ తక్షణమే అమలులోకి రానుంది.
ఫ్రాన్స్ వేదికగా ట్రంప్ సంతకం
జీ7 శిఖరాగ్ర సమావేశం అనంతరం ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్ ప్యాలెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆతిథ్యం ఇచ్చిన విందు కార్యక్రమంలో ట్రంప్ సంతకాలు చేశారు. వైట్‌హౌస్ విడుదల చేసిన వీడియోలో ఈ విషయం స్పష్టమైంది.
మెక్రాన్ తన పోస్టులో “ట్రంప్ వెర్సైల్స్‌లో ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంపై సంతకం చేశారు. ఇది శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుంది. హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుంది. దీంతో త్వరలో ఇంధన ధరలు తగ్గుతాయి” అని ప్రకటించారు. విందు అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపారు. ముందుగా స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగాల్సిన సంతకాలు ఫ్రాన్స్‌లో ముందుగానే జరిగాయి. అయితే స్విట్జర్లాండ్‌లో ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం జరుగుతుందని ఇరాన్ అధికారులు తెలిపారు.
ఇరాన్ హెచ్చరిక
ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, “మేము కూడా ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాము. 60 రోజుల ఈ ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలు అమెరికా చేపట్టకూడదు” అని స్పష్టం చేశారు. ఈ కాలంలో కొత్త ఆంక్షలు విధించడం లేదా సైనిక మోహరింపులు పెంచడం వంటి చర్యలు తీసుకోకూడదని హెచ్చరించారు. తమ దేశంలో ఉన్న శుద్ధి చేసిన యురేనియం విదేశాలకు తరలించబోమని తేల్చి చెప్పారు.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వం
అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ కూడా ఈ సంతకాలను ధృవీకరించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీన్ని ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’గా ప్రకటించారు. ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని, మొదటి అడుగుగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తుందని, అమెరికా నావికా దిగ్బంధనం ఎత్తివేస్తుందని వెల్లడించారు.
ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపించి, ఇంధన ధరలు తగ్గడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

