US-Iran Talks Held in Islamabad: పశ్చిమాసియాలోని సంఘర్షణకు తెరపడే దిశగా కీలక అభివృద్ధి చోటు చేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నట్లు సమాచారం. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ను వేదికగా చేసుకొని వచ్చే వారం ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమవుతారని మీడియా నివేదికలు వెల్లడించాయి.

14 పాయింట్ల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం, యురేనియం నిల్వల బదిలీ, హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గించడం వంటి ముఖ్యమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ తనపై విధించిన ఆంక్షల ఎత్తివేతను పట్టుబట్టుతోంది. ఈ అంశమే చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారింది. చర్చలు సానుకూలంగా ముగిస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా సంఘర్షణ ముగించడానికి తాము చేసిన ప్రతిపాదనలపై ఇరాన్ నుంచి త్వరలో స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటపడేసేందుకు ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇరాన్ త్వరగా ఒప్పందంపై సంతకం చేయకపోతే ఈ కార్యాచరణను ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్లస్’గా మార్చి మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇరాన్ హెచ్చరిక:

ఈ నేపథ్యంలో ఇరాన్ అమెరికాకు గట్టి హెచ్చరికలు చేసింది. ఐక్యరాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్‌కు ఇరాన్ యూఎన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇరవానీ లేఖ రాశారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా సైనిక చర్యలు కొనసాగిస్తే విపత్కర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు.

ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి స్థాపనకు ఈ చర్చలు కీలకమవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story