ట్రంప్‌ కీలక ఉత్తర్వు

US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యూబాకు చమురు విక్రయించే లేదా సరఫరా చేసే ఏ దేశానికైనా అదనపు సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు మరియు విదేశాంగ విధానాలకు అసాధారణమైన, అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా మారిందని పేర్కొంటూ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు ట్రంప్. ఈ ఉత్తర్వు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం, క్యూబాకు నేరుగా లేదా పరోక్షంగా చమురు (ముడి చమురు లేదా పెట్రోలియం ఉత్పత్తులు) అందించే ఏ దేశం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై అదనపు సుంకాలు విధించే అవకాశం కల్పించింది.

ట్రంప్ ఈ చర్య ముఖ్యంగా మెక్సికోపై ఒత్తిడి పెంచేలా ఉంటుందని తెలుస్తోంది. క్యూబాతో సన్నిహిత సంబంధాలు ఉన్న మెక్సికో నుంచి దూరం కావాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఇటీవల మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ క్యూబాకు చమురు రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇది అమెరికా ఒత్తిడి కారణంగా కాదని ఆమె స్పష్టం చేశారు.

క్యూబా ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ఉత్తర్వు ఆ దేశంపై ఒత్తిడిని బాగా పెంచనుంది. వెనిజులా నుంచి చమురు సరఫరా ఆగిపోయిన తర్వాత క్యూబా ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఇప్పుడు ట్రంప్ చర్యతో ఆ సరఫరాలు కూడా కష్టమయ్యే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story