వెనెజువెలాపై ‘రహస్య సోనిక్ ఆయుధం’ వాడాం!

US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను స్వాధీనం చేసుకునే ఆపరేషన్‌లో తమ సైన్యం రహస్య సోనిక్ ఆయుధాన్ని (Secret Sonic Weapon) ఉపయోగించినట్లు ధృవీకరించారు. ఈ అద్భుతమైన ఆయుధం తమ వద్ద మాత్రమే ఉందని, మరెక్కడా ఇలాంటి సాంకేతికత లేదని ఆయన స్పష్టం చేశారు.

జనవరి 3న వెనెజువెలాలోని కారకాస్‌లో జరిగిన 'ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్'లో అమెరికా దళాలు మెరుపుదాడి చేసి మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను నిర్బంధించాయి. ఈ దాడి సమయంలో రహస్య ఆయుధం వినియోగించినట్లు మొదటి నుంచీ వార్తలు వచ్చాయి. ఇటీవల ట్రంప్‌కు సన్నిహితంగా పనిచేసిన ఒక గార్డ్ ఇచ్చిన వివరాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఆ ఆయుధం ప్రభావంతో వెనెజువెలా సైనికులు, క్యూబన్ బాడీగార్డులు నేలపై పడిపోయారని, ముక్కుల నుంచి రక్తం కారడం, వాంతులు చేసుకోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపించాయని సాక్షులు చెప్పారు. ‘‘మా ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైంది. కొందరు వాంతులు చేసుకున్నారు. ఇంకొందరు నేలపై పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మేం నిలబడలేకపోయాం. అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే’’ అని ఒక సాక్షి ఆందోళన వ్యక్తం చేశాడు.

ఈ వివరాలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ రహస్య ఆయుధం విషయం మరింత హాట్ టాపిక్ అయింది. ట్రంప్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘‘మన దగ్గర ఎవరికీ తెలియని ఆయుధాలు ఉన్నాయి. వాటి గురించి ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిది. అదొక అద్భుతమైన దాడి’’ అని పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు వెనెజువెలా అధికారులు తెలిపారు. అయితే సోనిక్ ఆయుధం వల్లే ఎంతమంది ప్రభావితమయ్యారనేది స్పష్టంగా తెలియరాలేదు. అమెరికా మదురోపై మాదకద్రవ్యాల రవాణా ఆరోపణలతో ఈ చర్య చేపట్టినట్లు పేర్కొంది.

ఈ ఘటన ప్రపంచ దృష్టిని ఆకర్షించగా, అమెరికా సైనిక శక్తి, రహస్య సాంకేతికతలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story