మెక్సికోపై ట్రంప్ దాడి సంకేతమా?

US President Donald Trump: అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) తన దేశ విమానయాన సంస్థలకు ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేసింది. మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామా ప్రాంతాలు సహా తూర్పు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న విమానాలు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించింది. సైనిక కార్యకలాపాల కారణంగా ఆ ప్రాంతాల్లో విమానాలకు ముప్పు పొంచి ఉండవచ్చని హెచ్చరికలు ఇచ్చింది.

ఈ సందర్భంగా అమెరికాకు చెందిన అన్ని ఎయిర్‌లైన్లకు అడ్వైజరీ నోటీసులు పంపించారు. ఈ నోటీసులు 60 రోజుల పాటు అమలులో ఉంటాయని తెలిపింది. విమానాలు ఎంత ఎత్తున ప్రయాణిస్తున్నా, ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో కూడా ముప్పు ఎదుర్కొనే అవకాశం ఉందని ఎఫ్‌ఏఏ స్పష్టం చేసింది. సాధారణంగా యుద్ధాలు లేదా ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికోపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెక్సికోలోని మాదకద్రవ్యాల ముఠాలు మరియు వాటి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని బహిరంగంగా హెచ్చరించారు. లాటిన్ అమెరికాలో మెక్సికో, క్యూబా, కొలంబియా వంటి దేశాలు మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేసి అమెరికాకు అక్రమంగా సరఫరా చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ విధానాన్ని మార్చుకోకపోతే వెనెజువెలా లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే పేరుతో ఇటీవల వెనెజువెలాపై అమెరికా సైన్యం ఆకస్మిక దాడులు చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్యను అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో మిగతా లాటిన్ అమెరికా దేశాలకు కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఎయిర్‌లైన్లకు ఎఫ్‌ఏఏ హెచ్చరికలు ఇవ్వడం గమనార్హం. మెక్సికోపై దాడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఈ హెచ్చరికలు సూచిస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story