U.S: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. హార్మూజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని చాటేందుకు ఇరాన్ నౌకలపై దాడులు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిగా అమెరికా టెహ్రాన్‌పై తీవ్ర దాడులు చేస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం అటకెక్కింది.

ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేయాలని అమెరికా యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. పవర్ ప్లాంట్లు, రిఫైనరీలపై దాడులు చేసి టెహ్రాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ కూడా పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

సోమవారం అంతర్జాతీయ మార్కెట్లు ప్రారంభం కాకముందే ఈ దాడులను పూర్తి చేయాలని అమెరికా అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఈ ప్రతిపాదిత దాడుల వివరాలను అప్పటికప్పుడు ఇజ్రాయెల్‌కు తెలియజేస్తున్నారు.

ఇజ్రాయెల్ అధికారులు మాత్రం పూర్తిస్థాయి సైనిక చర్యలో పాల్గొనడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమ దేశాన్ని యుద్ధంలో భాగస్వామ్యం కావాలని ఎవరూ అడగలేదని చెప్పారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. వైట్‌హౌస్‌లోని కొందరు అధికారులు దీన్ని వ్యతిరేకించగా, అధ్యక్షుడు ట్రంప్ కఠిన వైఖరి ప్రదర్శించారు. ఇరాన్‌ను లొంగిపోక తప్పని పరిస్థితుల్లో ఉంచాలని ఆయన సూచించినట్లు సమాచారం.

మరోవైపు ఇరాన్ అమెరికాకు హెచ్చరిక జారీ చేసింది. యూఎస్ తీసుకునే నిర్లక్ష్యపూరిత చర్యలకు ప్రతిదాడి ఉంటుందని స్పష్టం చేసింది.

పశ్చిమాసియా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story