విద్యార్థుల వీసాలపైనా అమెరికా ఆంక్షలు

అమెరికాలో విదేశీ విద్యార్థులపై ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇప్పుడు విద్యార్థుల వీసా నిబంధనల్లోనూ కఠినమైన ఆంక్షలు విధించింది. వీసాల రద్దు విషయంలో మరిన్ని అంశాలు చేర్చింది. ఇప్పటికే పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ వారిని దేశం విడిచిపెట్టాల్సిందిగా ఆదేశిస్తున్న అమెరికా ప్రభుత్వం.. ఇప్పుడు గైర్హాజరును కూడా పరిగణనలోకి తీసుకొని వీసాలను రద్దు చేస్తామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది.
ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విద్యాసంస్థ నుంచి డ్రాపౌట్ అయినా, తరగతులను ఎగ్గొట్టినా, లేదా ముందస్తుగా తెలియచేయకుండా స్టడీ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోయినా ఆ విద్యార్థుల వీసాలు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. అలా జరిగితే భవిష్యత్తులో ఏరకమైన అమెరికా వీసాలకైనా అర్హత కోల్పోతారని హెచ్చరించింది. నిబంధనల ప్రకారం వ్యవహరించి, విద్యార్థి వీసాను చెల్లుబాటులో ఉంచుకోవాలని సూచించింది.
