US Senator Bill Haggerty: గల్వాన్ ఘర్షణపై అమెరికా సెనెటర్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా సెనెటర్ సంచలన వ్యాఖ్యలు

US Senator Bill Haggerty: అమెరికా సెనెటర్ బిల్ హాగెర్టీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సైనికులను కరిగించేందుకు చైనా విద్యుదయస్కాంత ఆయుధాలను ఉపయోగించిందని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల క్రితం సరిహద్దు వద్ద జరిగిన గల్వాన్ ఘర్షణ సందర్భంగా చైనా ఈ ఆయుధాలను మోహరించినట్లు పేర్కొన్నారు.
సెనెటర్ హాగెర్టీ మాట్లాడుతూ, "చైనా-భారత్ సంబంధాలు సుదీర్ఘకాలంగా విశ్వాసలేమితో కొనసాగుతున్నాయి. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా విద్యుదయస్కాంత ఆయుధాలను ఉపయోగించింది" అని వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణలో భారత్, చైనా సైనికులు రాళ్లు, కర్రలతో తలపడ్డారు. ఈ సంఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా తమవైపు ఐదుగురు సైనికులు మరణించినట్లు చెప్పగా, అంతర్జాతీయ మీడియా కథనాలు మృతుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇటీవలి కాలంలో భారత్-చైనా సంబంధాలు కొంత మెరుగుపడుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ గతేడాది కీలక గస్తీ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, 2020 నాటి యథాస్థితిని ఎల్‌ఏసీ వెంబడి కొనసాగించనున్నారు. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఈ నేపథ్యంలో, ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించి, ఎస్‌సీఓ సదస్సులో పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలు విధిస్తోన్న సమయంలో ఈ పర్యటన జరగడం అమెరికాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ సందర్భంలో సెనెటర్ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
అమెరికా రాయబారి సెర్గీ గోర్ గతంలో భారత్‌ను చైనాకు దూరం చేసి, అమెరికాకు దగ్గర చేసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారత్‌తో అమెరికా సంబంధాలు దశాబ్దాల నాటివని, చైనాతో కంటే భారత్‌తో గొప్ప స్నేహం ఉందని చెప్పారు. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌ఎన్‌జీ కోసం భారత్ ప్రధాన మార్కెట్‌గా ఉండాలని అమెరికా కోరుకుంటోందని, వాణిజ్య చర్చలు ఈ దిశగా సాగుతున్నాయని తెలిపారు.
