భారత్‌కు వెనిజులా చమురు అమ్మకం!

US Set to Sell Venezuelan Oil to India: రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. వెనిజులా చమురును భారత్‌కు విక్రయించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. అమెరికా నియంత్రణలోని కొత్త చట్టం కింద ఈ అమ్మకాలు జరుగనున్నాయి.

వెనిజులా తాత్కాలిక ప్రభుత్వం నుంచి 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల అధిక నాణ్యత గల ముడి చమురును అమెరికా స్వీకరించనుంది. ఈ చమురును ప్రపంచ మార్కెట్‌లో విక్రయించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అందులో భాగంగా భారత్‌కు కూడా అమ్మకాలకు అవకాశం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. యూఎస్ రిఫైనరీలతో పాటు ఐరోపా, ఆసియా దేశాలు కూడా వెనిజులా చమురుపై ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు.

ట్రంప్ ఇటీవల ప్రకటించిన ప్రణాళిక ప్రకారం, వెనిజులా నుంచి సేకరించిన చమురును మార్కెట్ ధరకు విక్రయిస్తామని, ఆ ఆదాయం అమెరికా నియంత్రణలోనే ఉంటుందని తెలిపారు. ఈ నిధులను వెనిజులా, అమెరికా ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని త్వరగా అమలు చేయాలని ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్టోఫర్ రైట్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ వెల్లడించారు.

చమురు నిల్వలను ఓడల ద్వారా రవాణా చేసి అమెరికా ఓడరేవులకు చేర్చనున్నారు. గతంలో ఆంక్షల వల్ల వెనిజులా చమురు దిగుమతులు నిలిచిపోయిన భారత్‌కు ఇది కొత్త అవకాశంగా మారనుంది. రష్యా చమురు ధరలపై అమెరికా ఆంక్షలు పెరగడంతో ప్రత్యామ్నాయాలను వెతుకుతున్న భారత్‌కు ఈ పరిణామం ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విక్రయాలు అమెరికా నియంత్రణలోనే జరుగుతాయని, చట్టబద్ధమైన వాణిజ్యమే అనుమతిస్తామని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల నుంచి వెనిజులా చమురుకు డిమాండ్ బాగానే ఉందని అమెరికా ఇంధన శాఖ అధికారులు తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story