US Soldier Charged: రహస్య సమాచారంతో బెట్టింగ్: మదురో ఆపరేషన్‌పై అమెరికా సైనికుడికి కేసు
మదురో ఆపరేషన్‌పై అమెరికా సైనికుడికి కేసు

US Soldier Charged: అమెరికా సైన్యంలో పనిచేస్తున్న ఒక ప్రత్యేక దళ సైనికుడు రహస్య సైనిక సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఆన్‌లైన్ అంచనా మార్కెట్‌లో భారీగా డబ్బు సంపాదించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో అతనిపై అమెరికా న్యాయశాఖ కేసులు నమోదు చేసింది.
ఆ సైనికుడు వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను పట్టుకునేందుకు అమెరికా నిర్వహించిన గోప్య ఆపరేషన్‌లో భాగంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ ఆపరేషన్‌కు సంబంధించిన రహస్య వివరాలు ముందుగానే తెలిసిన కారణంగా, మదురో అధికారంలో నుండి తొలగించబడతాడనే అంచనాతో అతను బెట్టింగ్ పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ బెట్టింగ్‌ల ద్వారా అతను సుమారు 4 లక్షల డాలర్లకు పైగా (సుమారు కోట్ల రూపాయలు) లాభం పొందినట్లు విచారణలో వెల్లడైంది. ఈ లావాదేవీలను దాచిపెట్టేందుకు విదేశీ క్రిప్టో ఖాతాలు ఉపయోగించడం, తన అకౌంట్‌ను తొలగించడానికి ప్రయత్నించడం వంటి చర్యలు కూడా చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనలో అతనిపై వైర్ ఫ్రాడ్, కమోడిటీ ఫ్రాడ్, రహస్య సమాచార దుర్వినియోగం వంటి పలు తీవ్రమైన అభియోగాలు నమోదు అయ్యాయి. దోషిగా తేలితే దీర్ఘకాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఈ కేసు ప్రత్యేకత ఏమిటంటే, ప్రభుత్వ రహస్య సమాచారాన్ని ఉపయోగించి అంచనా మార్కెట్‌లలో లాభాలు పొందిన మొదటి కేసుగా ఇది గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లపై మరింత నియంత్రణ అవసరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

