US Strikes: అమెరికా దాడుల్లో ఇరాన్ కీలక మౌలిక సదుపాయాల ధ్వంసం.. చాబహార్ టవర్ నేలమట్టం
చాబహార్ టవర్ నేలమట్టం

US Strikes: ఇరాన్‌పై అమెరికా ఆరో రోజు రాత్రి కూడా తీవ్ర దాడులు చేసింది. పౌర మౌలిక వసతులు, వంతెనలు, రైల్వే నెట్‌వర్క్, ఎయిర్‌పోర్టులు, ద్వీపాల్లోని విద్యుత్ సరఫరా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. దీంతో దక్షిణ ఇరాన్‌లోని అనేక నగరాలు, దీవుల్లో కీలక మార్గాలు దాదాపు మూసుకుపోయాయి.
అహ్‌వాజ్, ఖేష్మ్, దాష్తి, సిరిక్, బందర్ ఈ లెంగే వంటి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. బందర్ ఈ ఖమీర్‌లో రెండు వంతెనలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బందర్ అబ్బాస్‌లో కూడా తీవ్ర పేలుళ్లు సంభవించాయి. హర్మూజ్ ప్రావిన్స్‌లో రోడ్డు-రైల్వే నెట్‌వర్క్‌ను టార్గెట్ చేసి దెబ్బతీసింది అమెరికా. ఇరాన్‌షహర్ ఎయిర్‌పోర్టుపై దాడితో అక్కడ విద్యుత్ సరఫరా స్థంభించింది. కిష్ ద్వీపంలో కూడా విద్యుత్ సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ దాడుల్లో ముగ్గురు మరణించినట్లు ఇరాన్ వెల్లడించింది.
చాబహార్ టవర్ మూడోసారి ధ్వంసం
చాబహార్ రేవులోని మారిటైమ్ కంట్రోల్ టవర్‌పై అమెరికా దళాలు మూడోసారి దాడి చేశాయి. పదేపదే దాడుల వల్ల టవర్ పూర్తిగా కుప్పకూలింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారత్ నుంచి అఫ్గానిస్థాన్, మధ్య ఆసియా దేశాలకు కీలకమైన వాణిజ్య మార్గం ఈ చాబహార్ పోర్ట్. దీనికి తీవ్ర దెబ్బ తగిలింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడులు ముగిశాయని ప్రకటించింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లు, యుద్ధనౌకలను ఉపయోగించి ఇరాన్ రక్షణ, లాజిస్టిక్స్, నిఘా, మారిటైమ్ సామర్థ్యాలను భారీగా దెబ్బతీసినట్లు తెలిపింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో సుమారు 50,000 అమెరికా సైనికులు ఉన్నట్లు వెల్లడించింది.
ఇరాన్ ప్రతిస్పందన
అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఖతార్, బహ్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ నేతలు అమెరికా స్థావరాలను ఆక్రమించి సైనికులను బంధించాలని పిలుపునిచ్చారు.
ఈ దాడులతో ఇరాన్‌లో పరిస్థితి తీవ్రంగా మారింది. మరిన్ని వివరాలు రాబోతున్నాయి.

