U.S. Supreme Court: నేరారోపణలు రుజువైతే గ్రీన్ కార్డ్ హోల్డర్లకు దేశబహిష్కరణ తప్పదన్న అమెరికా సుప్రీం కోర్టు
అమెరికా సుప్రీం కోర్టు

U.S. Supreme Court: డిపోర్టేషన్ (దేశబహిష్కరణ) నిబంధనలను సడలించేలా అమెరికా సుప్రీం కోర్టు ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడిన శాశ్వత నివాసులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లను కూడా దేశం నుంచి బహిష్కరించడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలను కోర్టు సమర్థించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ తీర్పు వెలువడింది.
అయితే, నేరం జరిగి ఉండవచ్చని నమ్మడానికి బలమైన కారణాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు దేశ సరిహద్దు ఎంట్రీ పాయింట్ల వద్దే ప్రవేశం నిరాకరించే అవకాశం ఈ తీర్పుతో పెరిగింది. బోర్డర్ ఏజెంట్ల అధికారాలను మరింత బలోపేతం చేస్తూ ఈ నిర్ణయం వచ్చింది.
కేసు వివరాలు
ఈ కేసు చైనా జాతీయుడు మక్ చోయ్‌కు సంబంధించింది. నకిలీ ట్రేడ్‌మార్క్ కేసులో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. 2012లో చైనా నుంచి అమెరికాకు తిరిగి వచ్చినప్పుడు ఆయనను దేశంలోకి ప్రవేశించనీయకుండా అధికారులు నిరాకరించారు. తర్వాత కఠిన షరతులతో అనుమతి ఇచ్చారు. ఆయన తన తప్పు అంగీకరించడంతో డిపోర్టేషన్ ఆదేశాలు జారీ అయ్యాయి.
తాను చేసిన నేరం 'నైతిక దుష్ప్రవర్తన' కిందికి రాదని వాదిస్తూ మక్ చోయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే, కోర్టు ఆయన వాదనను తోసిపుచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పు అమెరికాలో శాశ్వత నివాసం కలిగిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది ట్రంప్ ప్రభుత్వం యొక్క ఇమ్మిగ్రేషన్ నియంత్రణ విధానాలకు బలం చేకూరుస్తుంది.

