ట్రంప్ సహాయకుడు సూచన

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హింట్: రష్యా చమురు కొనుగోళ్లు తగ్గడంతో 25 శాతం టారిఫ్‌లు తొలగించే మార్గం ఉంది

US Treasury Secretary Scott Besent Hint: భారత్‌పై అమెరికా విధించిన అదనపు 25 శాతం సుంకాలు (టారిఫ్‌లు) తగ్గించే లేదా తొలగించే అవకాశం ఉన్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సూచనలు ఇచ్చారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు భారత్ గణనీయంగా తగ్గించుకోవడం ఇందుకు కారణంగా చెప్పారు.

అమెరికా ట్రంప్ ప్రభుత్వం రష్యా చమురు కొనుగోళ్లపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాకు భారత ఎగుమతులపై మొత్తం సుంకాలు 50 శాతం వరకు అమలవుతున్నాయి.

స్కాట్ బెసెంట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకాలు విధించాం. అయితే భారత్ ఆ కొనుగోళ్లను భారీగా తగ్గించుకుంది. ఇది భారీ విజయం. టారిఫ్‌లు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని నేను అనుకుంటున్నాను" అని పరోక్షంగా సూచించారు.

కొన్ని రోజుల క్రితం అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతున్నందుకు విధానపరమైన అడ్డంకులు కాదని, ప్రధాని నరేంద్ర మోదీతో అధ్యక్షుడు ట్రంప్ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని వ్యాఖ్యానించారు. ఇలా ఇరువురు మంత్రులు భిన్నమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

భారత్ రష్యా చమురు దిగుమతులను తగ్గించుకోవడంతో అమెరికా సుంకాల తొలగింపు వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సూచనలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story