U.S. Visa Rules: అమెరికా వీసా: డయాబెటిస్, ఒబెసిటీతో బాధపడితే.. వలసలు కల్పించకుండా కఠిన నిబంధనలు!
వలసలు కల్పించకుండా కఠిన నిబంధనలు!

U.S. Visa Rules: అధికారంలోకి ప్రవేశించిన తొలి రోజు నుంచే వలసదారులపై గట్టి ఆంక్షలు విధిస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోసారి కొత్త ఆదేశాలు జారీ చేశారు. డయాబెటిస్, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి అమెరికా వీసాలు (US Visa)ను తిరస్కరించాలనే కొత్త మార్గదర్శకాలను రూపొందించారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ఎంబసీలు, కాన్సులేట్లకు పంపినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి.
సాధారణంగా, అమెరికా వీసా దరఖాస్తుల ఆరోగ్య పరిస్థితిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తప్పనిసరిగా పరీక్షిస్తారు. టీబీ వంటి ఇన్ఫెక్షన్ వ్యాధులపై ఫోకస్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ నియమాలకు సవరణలు తీసుకొచ్చి, మరిన్ని దీర్ఘకాలిక వ్యాధులను జాబితాలో చేర్చారు. ఇకపై దరఖాస్తుదారుల మెడికల్ రికార్డులపై మరింత శ్రద్ధ పెట్టి, వారి ఆరోగ్య సమస్యలు అమెరికా ప్రభుత్వ ఖర్చులకు దారితీస్తాయా అని అంచనా వేస్తారు. ఉదాహరణకు, డయాబెటిస్ లేదా ఒబెసిటీ వల్ల లక్షలాది డాలర్ల చికిత్స ఖర్చు పడితే, వీసా తిరస్కరణకు మార్గం సుగమమవుతుందని సూచించారు. ఇలాంటి వ్యాధులతో బాధపడేవారిని అమెరికాలోకి అనుమతించకుండా, ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ మార్పులు తీసుకొచ్చారని సమాచారం.
ఈ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నట్లుగా, "దరఖాస్తు చేసుకున్నవారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. హృదయ సంబంధిత సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, మెటబాలిక్ డిసార్డర్లు, న్యూరాలజికల్ అనారోగ్యాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే... వాటి చికిత్సకు లక్షల డాలర్లు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా, ఒబెసిటీ వల్ల ఆస్తమా, స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు వంటి అదనపు సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి దీర్ఘకాలిక చికిత్సలకు భారీ ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి, వలసదారులు ప్రభుత్వ సంపదపై ఆధారపడే అవకాశం ఉంటే, వారి ప్రవేశాన్ని నిరోధించాలి" అని ఆదేశించారు.
ఇంకా, దరఖాస్తుదారులు స్వంత ఖర్చుపై చికిత్సలు చేయగలరా? లేదా ప్రభుత్వ సహాయం అవసరమా? అన్నది కూడా తేల్చుకోవాలని, అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షించాలని వీసా అధికారులకు సూచించారు. అయితే, ఈ కొత్త నిబంధనలపై అమెరికా విదేశాంగ శాఖ ఇంకా అధికారిక స్పందన ఇవ్వలేదు. దీంతో ఇవి పూర్తిగా అమలులోకి వచ్చాయా లేదా అనేది అస్పష్టంగానే ఉంది.
ఇప్పటికే వలసదారులపై అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్న సందర్భంలో ఈ మార్పులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల 'డ్యూరేషన్ ఆఫ్ స్టే'పై పరిమితులు విధించడం, H-1B వీసాలకు వార్షిక ఫీజు లక్ష డాలర్లకు పెంచడం వంటి నిర్ణయాలు ఇప్పటికే వలసదారులను కలవరపరిచాయి. ఈ కొత్త ఆరోగ్య నిబంధనలు అమెరికా కలలు కనడానికి ప్రయత్నిస్తున్నవారికి మరో అడ్డంకిగా మారతాయా అనేది చూడాలి.

