హిందూ సమాజం నుంచి తీవ్ర ఆగ్రహం

USA: అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని సుగర్‌ ల్యాండ్‌ ప్రాంతంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్‌ కాంస్య విగ్రహం పై మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) మద్దతుదారుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హిందూ సమాజంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ విగ్రహాన్ని భారతీయ వలసదారుల 'దండయాత్ర'కు నిదర్శనంగా అభివర్ణిస్తూ, అమెరికాను ఆక్రమించుకుంటున్నారంటూ ఆయన చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది.

ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన హనుమాన్‌ విగ్రహంగా ప్రసిద్ధి చెందిన ఈ 'స్టాచ్యూ ఆఫ్‌ యూనియన్‌'ను హిందూ భక్తులు విరాళాలతో నిర్మించారు. మాగా కార్యకర్త కార్లోస్‌ టుర్సియోస్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసి, "వలసదారులు టెక్సాస్‌ను, అమెరికాను ఆక్రమించుకుంటున్నారు. మూడో అతిపెద్ద విగ్రహం ఇక్కడ ఎందుకు? ఈ దండయాత్రను ఆపాలి" అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించాడు. ఇది హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్న ద్వేషపూరిత వ్యాఖ్యలుగా నెటిజన్లు భావిస్తున్నారు.

ఆలయ సమాజ సభ్యులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. "ఇది ప్రైవేటు సముదాయ ఆస్తి. భక్తుల విరాళాలతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం మత స్వేచ్ఛకు చిహ్నం. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొడతాయి" అని వారు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కార్లోస్‌ను ట్రోల్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఇది అమెరికా బహుసాంస్కృతిక సమాజానికి వ్యతిరేకమని వాదిస్తున్నారు.

ఇదే విగ్రహం పై గతంలో రిపబ్లికన్‌ పార్టీ నేత అలెగ్జాండర్‌ డంకన్‌ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఇది నిజమైన దేవుడి విగ్రహం కాదు. హిందూ విగ్రహాలను అమెరికాలో అనుమతించకూడదు" అంటూ ఆయన మాట్లాడటం గమనార్హం. దీన్ని హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుత ఘటనతో మరోసారి మత సామరస్యం ప్రశ్నార్థకమవుతోంది. అమెరికాలోని హిందూ సమాజం ఈ వివాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story