US–Bangladesh Trade Deal: అమెరికా-బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం: ఆశించినంత లాభం లేదు.. టారిఫ్‌లు కేవలం 1% తగ్గింపు!
టారిఫ్‌లు కేవలం 1% తగ్గింపు!

US–Bangladesh Trade Deal: వాణిజ్య ఒప్పందాల్లో భారీ లాభాలు ఆశించి ప్రయత్నాలు చేసినా, కొన్నిసార్లు చిన్న మార్పులతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ విషయంలోనూ అదే జరిగింది. అమెరికాతో కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందంలో టారిఫ్‌లు 20 శాతం నుంచి 19 శాతానికి తగ్గనున్నాయి. సోమవారం ఈ ఒప్పందంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమీసన్ గ్రీర్, బంగ్లాదేశ్ ప్రతినిధి షేక్ బషీరుద్దీన్ సంతకాలు చేశారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం అధికారిక ప్రకటనలో ధ్రువీకరించింది.
ఈ ఒప్పందం ద్వారా బంగ్లాదేశ్ టెక్స్‌టైల్, దుస్తుల ఉత్పత్తులపై మినహాయింపులు పొందే అవకాశం కల్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తుంది. అయితే, ఇందుకు బదులుగా అమెరికాలో తయారైన కాటన్‌ను ఉపయోగించాలని బంగ్లాదేశ్ అంగీకరించింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ సలహాదారు మహమ్మద్ యూనస్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. గతంలో ట్రంప్ పాలనలో బంగ్లాదేశ్‌పై 37 శాతం టారిఫ్‌లు విధించగా, తర్వాత వాటిని 20 శాతానికి తగ్గించారు. ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో మరో ఒక శాతం తగ్గించి 19 శాతంగా నిర్ణయించారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం 18 శాతం టారిఫ్‌ల వద్ద కుదిరిన నేపథ్యంలో, వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన బంగ్లాదేశ్‌లో ఆందోళన మొదలైంది. దీంతో భారత్ కంటే తక్కువ టారిఫ్‌లతో ఒప్పందం కుదుర్చుకోవాలని బంగ్లాదేశ్ యత్నించింది. ఈ ప్రక్రియలో అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, వైద్య పరికరాలు, ఆటోమొబైల్ భాగాలు, ఇంధన ఉత్పత్తులకు తమ మార్కెట్‌ను తెరవడానికి బంగ్లాదేశ్ సమ్మతించింది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

