రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీరుపై డోనాల్డ్‌ ట్రంప్‌ అసహనం

ఉక్రెయిన్‌ తో యుద్దం యాభై రోజులలో ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్దం కొనసాగుతుండటంతో అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఇక యుద్దం ఆపాల్సిందేనని రష్యాకి ట్రంప్‌ అల్టిమేటమ్‌ జారీ చేశారు. యుద్దం విషయంలో పుతిన్‌ వైఖరి తనను చాలా అసహనానికి గురిచేస్తోందని ట్రంప్‌ అంటున్నారు. పుతిన్‌ తో ఫోన్లో మాట్లాడినప్పుడు శాంతి గురించి మాట్లాడుతున్నారిని భావిస్తా అని తీరా రాత్రికి రాత్రి ఉక్రెయిన్‌ పై మిస్సైళ్ళ వర్షం కురిపిస్తున్నారని ట్రంప్‌ మండిపడ్డారు. పుతిన్‌ వ్యవహార సరళి తనను తీవ్ర నిరాశకు గురిచేస్తోందన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలకు చరమగీతం పలకాలని ఓ పక్క తాను ప్రయత్నాలు చేస్తుంటే మరో పక్క పుతిన్‌, జలన్‌స్కీల వైఖరి ఆ ప్రయత్నాలను ముందుకు సాగనివ్వడం లేదనే అభిప్రాయంలో ట్రంప్‌ ఉన్నారు.

ఇటువంటి పరిస్ధితుల్లో రష్యాపై కొత్త ఆంక్షలు విధించడానికి సిద్దమువుతున్నట్లు ట్రంప్‌ యధాలాపంగా తెలియజేశారు. ఈ అంశంపై ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ రష్యాపై రేపు మేము ఏం చేస్తామో చూడంటూ చేసిన వ్యాఖ్యలు అనేక ఊహాగానాలకు ఆస్కారమిచ్చాయి. ఇప్పటికే అమెరికా సెనెటర్లు రష్యాపై కఠిన ఆంక్షలు విధించే బిల్లును ప్రతిపాదించినట్లు ప్రచారం అవుతోంది. రష్యాపై ఆంక్షలు విధించేందుకు ఈ బిల్లు ట్రంప్‌ కు ప్రత్యేక అధికారాలు కట్టబెడుతుందని సమాచారం. ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్‌ తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న వ్యాఖ్యలు అటు ఉక్రెయిన్ పైనా ఇటు రష్యాపైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఓ పక్కన రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్దం ఆపాలని ప్రయత్నిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ మరో పక్క ఆయుధాల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఉక్రెయిన్ దేశానికి పేట్రియాట్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ క్షిపణులను ఇవ్వనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఈ ఆయుధాల ఖర్చును వంద శాతం యూరోపియన్‌ యూనియన్‌ భరిస్తుందని ప్రకటించి ఇది జస్ట్‌ బిజినెస్‌ అఫైర్‌ అని ట్రంప్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

Politent News Web 1

Politent News Web 1

Next Story