Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హింస పెరిగిపోయింది.. భయపడి దేశం వీడలేదు: షేక్ హసీనా
భయపడి దేశం వీడలేదు: షేక్ హసీనా

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో కొనసాగుతోన్న అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు. గతేడాది జరిగిన మారణకాండను ఆపేందుకే తాను దేశం విడిచి భారత్‌కు వచ్చానని, భయపడి పారిపోలేదని స్పష్టం చేశారు. అయినా దేశంలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హింస బాగా పెరిగిపోయిందని, ప్రభుత్వం పూర్తిగా బలహీనమైపోయిందని హసీనా విమర్శించారు. చట్ట వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయిందని, సరైన పాలన లేకపోతే బంగ్లాదేశ్ అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఈ పరిస్థితులు భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను కూడా దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల అల్లర్లలో 25 ఏళ్ల హిందూ యువకుడు దీపూ చంద్రదాస్‌ను దారుణంగా కొట్టి, నిప్పంటించి చంపిన ఘటనపై హసీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల రక్షణలో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే భారత్‌కు వ్యతిరేక చర్యలు తీసుకుంటూనే, పైకి స్నేహభావం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని తాత్కాలిక ప్రభుత్వాలు వచ్చినా భారత్-బంగ్లా బంధాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు.
యూనస్‌కు మద్దతుగా ఉన్న తీవ్రవాద శక్తులే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని, తనను, తన కుటుంబాన్ని ప్రాణభయంతో పారిపోయేలా చేశాయని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుత ప్రభుత్వం దౌత్య కార్యాలయాలను రక్షిస్తుందని, కానీ యూనస్ ప్రభుత్వం గూండాలకు మద్దతిస్తోందని ఆరోపించారు. తమ పాలనలో జైలుపాలైన తీవ్రవాదులను విడుదల చేయడంతోనే దేశంలో అల్లర్లు మరింత తీవ్రమయ్యాయని విమర్శించారు.
హాదీ హత్య కేసులో లుక్‌అవుట్ నోటీసు
యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడు ఫైసల్ కరీం మసూద్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది. అతనిపై ప్రయాణ నిషేధం విధించింది. ప్రస్తుతం దేశంలోనే ఉన్న మసూద్ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి స్థానాలు మారుస్తున్నట్లు భద్రతా ఏజెన్సీలు తెలిపాయి.

