Visa Fraud in the United States: అమెరికాలో వీసా మోసం: గ్రీన్‌కార్డు కోసం నకిలీ దోపిడీల నాటకం.. 11 మంది భారతీయులపై ఆరోపణలు
11 మంది భారతీయులపై ఆరోపణలు

Visa Fraud in the United States: అమెరికాలో అక్రమంగా నివసిస్తూ వీసా మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 11 మంది భారతీయులను అధికారులు అరెస్టు చేశారు. గ్రీన్‌కార్డు పొందేందుకు చోరీలు, దోపిడీల నాటకాలు రచించి యూ-వీసా (U-Visa) ప్రయోజనాలు పొందాలని వీరు ప్రణాళికాబద్ధంగా కుట్ర చేశారని యుఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.
అమెరికాలో హింసాత్మక నేరాల బాధితులు యూ-వీసాకు (నాన్-ఇమిగ్రేషన్ స్టేటస్) దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసా ద్వారా పని అనుమతులతో పాటు 5-10 ఏళ్లలో గ్రీన్‌కార్డు పొందే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలను దుర్వినియోగం చేసి, నకిలీ దోపిడీలు, ఆయుధాలతో బెదిరింపులు నిర్వహించి తాము బాధితులమని నమ్మించి వీసా పొందేందుకు వీరు ప్రయత్నించారు.
మసాచుసెట్స్, కెంటకీ, ఒహాయో తదితర రాష్ట్రాల్లో ఈ 11 మంది భారతీయులను అరెస్టు చేశారు. వీరంతా అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్లు గుర్తించారు. ఓ వ్యక్తిని భారత్‌కు డిపోర్ట్ చేశారు. మరికొందరిని కోర్టులో హాజరుపరిచి విడుదల చేశారు. మిగిలిన వారిని రిమాండ్‌లో ఉంచారు.
నిందితులు ఒక ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృతంగా మోసాలు చేశారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, కన్వీనియన్స్ స్టోర్ల వద్ద నకిలీ దోపిడీలు చేయించారు. ఆ ఘటనల్లో తాము బాధితులమని కట్టుకథలు అల్లి యూ-వీసాలకు దరఖాస్తులు చేసేందుకు ప్రయత్నించారు. ఈ నకిలీ దోపిడీలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోలను ఆధారంగా వీసా అప్లికేషన్లలో ఉపయోగించాలని చూశారు.
ఈ కేసులో నేరం నిరూపితమైతే నిందితులకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.
ఈ మోసం వలస విధానాల దుర్వినియోగానికి ఉదాహరణగా నిలిచింది. అధికారులు ఇలాంటి కుంభకోణాలపై మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

