Donald Trump: ట్రంప్-పోప్ మధ్య తీవ్ర మాటల యుద్ధం: ‘ఇలాంటి పోప్ నాకు అక్కర్లేదు’ అంటూ అమెరికా అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు
‘ఇలాంటి పోప్ నాకు అక్కర్లేదు’ అంటూ అమెరికా అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు

నేను మీకు భయపడను: లియో-14 కౌంటర్
Donald Trump: అమెరికాలో జన్మించిన మొదటి పోప్ లియో-14తో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధాలపై పోప్ చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ ఘాటుగా స్పందించారు.
పోప్ లియో-14 ఇరాన్‌పై అమెరికా చర్యలను ఖండిస్తూ, “సర్వశక్తిమంతులమనే భ్రమ, అధికార మోహం యుద్ధాలకు దారితీస్తోంది” అని ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ఆయన తన వ్యాఖ్యల్లో ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. ఈ వ్యాఖ్యలు ట్రంప్‌కు నచ్చకపోవడంతో, ఆదివారం రాత్రి సామాజిక మాధ్యమంలో సుదీర్ఘ పోస్టు ద్వారా తీవ్ర విమర్శలు చేశారు.
“పోప్ వామపక్ష తీవ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. విదేశాంగ విధానాలపై తప్పుడు వైఖరి అవలంబిస్తున్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలున్నా అభ్యంతరం లేదని చెప్పే పోప్ నాకు అవసరం లేదు. వెనెజువెలాపై అమెరికా సైనిక చర్యను తప్పుపట్టే పోప్ అక్కర్లేదు. దేశాధ్యక్షుడిని విమర్శించే ఇలాంటి పోప్ నాకొద్దు” అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇక పోప్ లియో-14 స్పందనలో, “నేను మీకు భయపడను. ట్రంప్ ప్రభుత్వానికి నేను భయపడటం లేదు. క్రైస్తవ సువార్త ఆధారంగానే శాంతికి పిలుపునిచ్చాను” అని తెలిపారు. “నేను వైట్‌హౌస్‌లో లేకుంటే లియో అసలు పోప్ అయ్యేవాడే కాదు” అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కూడా పోప్ స్పష్టమైన జవాబు ఇచ్చారు.
ఈ మాటల యుద్ధం ఇరు వైపులా తీవ్రమైన చర్చనీయాంశమైంది. అమెరికా యుద్ధ విధానాలపై పోప్ లియో-14 వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దృష్టి ఆకర్షించాయి. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్, వెనెజువెలా వంటి దేశాలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.

