ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఆందోళన

Imran Khan’s Sons Express Deep Concern: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై ఆయన కుమారులు సులేమాన్ ఇసా ఖాన్, కాసిం ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రావల్పిండి అడియాలా జైలులో 'డెత్ సెల్'లో ఉంచి మానసిక హింసకు గురిచేస్తున్నారని, తమ తండ్రిని ఇక మళ్లీ ఎప్పటికీ చూడలేమేమోననే భయం కలిగిందని వారు పేర్కొన్నారు.

ఆగస్టు 2023 నుంచి ఒంటరి నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను నెలల తరబడి చూడలేదని, మాట్లాడలేదని ఆయన కుమారులు బ్రిటిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. "పరిస్థితులు దిగజారుతున్నాయి. మా నాన్నను మళ్లీ చూడలేకపోవచ్చేమోనని ఆందోళనగా ఉంది" అని వారు అన్నారు. జైలు సిబ్బంది కూడా ఆయనతో మాట్లాడకుండా ఉండేలా ఆదేశాలున్నాయని, రోజుకు 23 గంటలు గదిలోనే గడపాల్సి వస్తోందని ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్‌తో జన్మించిన ఈ ఇద్దరు కుమారులు జనవరిలో పాకిస్థాన్‌కు వెళ్లి తండ్రిని కలవాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అయితే, జైలు అధికారులు కుటుంబ సభ్యులను కలవనివ్వకపోవడం, ఆరోగ్య విషయంపై సమాచారం అందకపోవడంతో ఆందోళన పెరిగిందని వివరించారు.

ఇటీవల ఇమ్రాన్ ఖాన్ సోదరి కూడా ఆయనను కలిసిన అనంతరం మానసిక వేధింపులకు గురవుతున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు 'సైనిక నియంతృత్వం'లా ఉన్నాయని కుమారులు విమర్శించారు.

అవినీతి, ఇతర కేసుల్లో నిందితుడిగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని ఆయన పార్టీ పీటీఐ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఆందోళన మరింత రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story